ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో బలమైన వామపక్ష పార్టీగా ఉన్న సీపీఐకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. సులువుగా గెలుస్తుందనుకున్న స్థానాల్లో కూడా ప్రత్యర్థులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడింది. సీపీఐ పోటీ చేసిన స్థానాల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రజలు ఇతర పార్టీలకు పట్టం కట్టి విలక్షణ తీర్పు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఒక స్థానంలో కూడా ఆ పార్టీ కనీసం బోణీ కూడా కొట్టలేదు. సాక్షాత్తు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నిల్చున్నా.. జిల్లా ప్రజలు ఆయనకు ఓటమి రుచి చూపించారు.
మాటల మాంత్రికుడిగా పేరున్న నారాయణ మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయడంతో ఆయన విజయం ఖాయమని, జిల్లాలో మూడు స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులను కూడా ఆయన చరిష్మాతో గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమాతో ఉన్నారు. కానీ శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎక్కడా కూడా వారు గెలుపొందిన అభ్యర్థుల దరిదాపుల్లో కూడా నిలవలేకపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు.
కాంగ్రెస్ కొంపముంచిందా?
ఎప్పుడూ లేని విధంగా వామపక్ష సిద్ధాంతాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని కొంతమంది సీపీఐ నాయకులు ధీమాతో ఉన్నప్పటికీ మరికొంత మంది మాత్రం కాంగ్రెస్ నాయకుల తీరుపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి అనుమానాలకు తగినట్టుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ది ఫలితాల్లో తేలింది. సీపీఐ పోటీ చేసిన ఖమ్మం పార్లమెంట్‌తోపాటు పినపాక, వైరా, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రె స్ పార్టీ బహిరంగంగానే ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చినట్లు తేలిపోయింది.
గత తీర్పుకు భిన్నంగా...
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి మూడు స్థానాల్లో సీపీఐ పోటీచేసింది. వీటిలో కొత్తగూడెం, వైరా స్థానాలను గెలుచుకోగా, పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సీపీఐ అభ్యర్థులు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఆ సీట్లలోనే పో టీకి దిగారు. ఈసారి మాత్రం ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చా రు. ఎంతో ఆశలు పెట్టుకున్న కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు ఘోరమైన ఓటమిని చవిచూశారు.
కొత్తగూడెం అభ్యర్థి కూనంనేని సాంబశివరావు తాను ఓడిపోతానని తెలిసినప్పటికీ ఈ స్థాయిలో ఓడిపోతానని అనుకోలేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు చంద్రావతిని కాదని ఆమె బంధువైన డాక్టర్ మూడు నారాయణను బరిలో నిలిపారు. దీంతో టీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగిన చంద్రావతి అక్కడ సీపీఐ ఓట్లను భారీగా చీల్చి ఆ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. అక్కడ మూడు నారాయణ మూడో స్థానానికి పడిపోయారు. అదేవిధంగా పినపాక నియోజకవర్గంలో ప్రస్తుత వైఎస్సార్‌సీపీ తరుపున గెలుపొందిన పాయం వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో సీపీఐ తరుపున పోటీచేశారు.
ఓటమి పాలైనా కూడా అప్పుడు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకు ము చ్చెమటలు పట్టించారు. అనంతరం సీపీఐనుంచి పాయం వెంకటేశ్వర్లును బయటకు పంపిం చగా, ఆయన వైఎస్సార్‌సీపీలో చేరి ఈ ఎన్నికల్లో తన సత్తా చాటి గెలుపొందారు. అక్కడ సీపీఐ తరుపున పోటీచేసిన తోలెం రమేష్ నాలుగో స్థానానికి పడిపోయారు. జిల్లాలో బలమైన క్యాడర్ ఉందని నమ్మిన సీపీఐకి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులా మారాయి. దీంతో వారు తమ ఓటమి వెనుక గల కారణాలపై పోస్టుమార్టం చేయడానికి సమాయత్తం అవుతున్నారు.
నారాయణకూ తప్పని ఓటమి...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గా కాంగ్రెస్‌మద్దతుతో పోటీకి దిగిన కె.నారాయణకు ఓటమి తప్పలేదు. మూడో స్థానానికే పరిమితమయ్యారు. నారాయణ ఎంతో నమ్మకంతో జిల్లాలోని సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు తనను గెలిపిస్తాయని భరోసాతో అందరికన్నా ముందుగానే ప్రచారం మొదలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. ముఖ్యంగా ఆయన స్థానికేతరుడు కావడంతోపాటు జిల్లా రాజకీయాలపై సరైన అవగాహన కూడా లేకపోవడం ఆయన ఓటమికి ముఖ్యకారణమని సీపీఐ, కాంగ్రెస్‌పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్లమెంట్ స్థానం కోసం పువ్వాడనాగేశ్వరరావు పోటీ పడినా కూడా జిల్లా కార్యవర్గం పట్టుపట్టి నారాయణనే బరిలోకి దింపింది. దీంతో నారాయణ కూడా తమ పార్టీపై పూర్తి నమ్మకంతో బరిలోకి దిగారు. అయితే ఆయన జిల్లా ప్రజల నాడిని కనిపెట్టలేకపోయారు.
సీపీఐకి భంగపాటు..
Published Sat, May 17 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement