కొత్తగూడెం, న్యూస్‌లైన్: కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గంలో ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న సీపీఐకి స్థానిక సంస్థల ఎన్నికలు అచ్చొచ్చినట్లుగా కనిపించడం లేదు. నియోజకవర్గం సీపీఐకి సిట్టింగ్ సీటు అయినా స్థానిక ఫలితాలను తమకు అనుకూలంగా రాబట్టలేకపోయింది. ఆ పార్టీ నాయకుల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సింగరేణిలో బలమైన కార్మికసంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సీపీఐకి అనుబంధంగా ఉండటంతో కొత్తగూడెం మండలంలో ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గత మండల పరిషత్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని ఎంపీపీని దక్కించుకుంది.
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటున్న ఏఐటీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండేది. ఇన్ని అనుకూలతలు ఉన్నా ఆ పార్టీ ప్రాదేశిక ఎన్నికల్లో డీలా పడటంపై చర్చసాగుతోంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే, ఎంపీపీ స్థానాలు చేతిలో ఉన్న సీపీఐ తన కేడర్‌ను విస్తరించుకోలేకపోయింది. ఎలాగైనా గెలుస్తామనే ధీమా వారిలో ఉన్నా ఈసారి జరిగిన మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికలు వారికి నిరాశను మిగిల్చాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ఉన్న అసంతృప్తి కూడా పార్టీని దెబ్బతీసిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. కిందిస్థాయి కేడర్‌ను పట్టించుకోక పోవడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది.
కూనంనేని సాంబశివరావు పరిషత్ ఎన్నికల్లో పాల్వంచ మండలంపై దృష్టి సారించి విస్తృత ప్రచారం చేశారు. అయినా ఒక్కస్థానం కూడా రాకపోవడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీపీఐ పాల్వంచలో పట్టుతప్పిందనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా పెద్దగా పట్టు లేకపోవడం వల్లే ఎనిమిది వార్డులకే పరిమితం కావాల్సి వచ్చిందంటున్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఈ మండలంలో కేవలం తొమ్మిది సీట్లను మాత్రమే సాధించగలిగింది. అయితే ఈ మండలంలో ఇతర పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సీపీఐ మద్దతు కీలకంగా మారింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మున్సిపల్, పరిషత్ ఫలితాలే ఇలా వస్తే రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అందుకే వైఫల్యాలపై విస్తృత చర్చ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కామ్రేడ్స్ ఏంటిలా..?
Published Thu, May 15 2014 2:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement