
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుతున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ అజీజ్ పాషా. చిత్రంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెలలో జరగనున్న పరిషత్ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకునే అధికారాన్ని జిల్లా కమిటీలకు కట్టబెడుతూ సీపీఐ నిర్ణయం తీసుకుంది. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణలకు అనుగుణంగా, గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీతోనైనా పొత్తు కుదుర్చుకునేందుకు జిల్లా నాయకత్వాలకు రాష్ట్రనాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, మండలస్థాయిలో పార్టీ బలపడేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించింది. వంద జెడ్పీటీసీ, వెయ్యి ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేయాలని తీర్మానించింది. శనివారం మఖ్దూంభవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ, కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాల్లో ఆయా అంశాలపై చర్చించింది. సోమవారం నుంచి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు అందించేందుకు 32 జిల్లాల నాయకులకు ఏ,బీ ఫారంలను పార్టీ ఇచ్చింది.
లెఫ్ట్, లౌకికశక్తులతో కలసి పోటీ: చాడ
పరిషత్ ఎన్నికల్లో ఇతర వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకికశక్తులను కలుపుకునిపోతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా వ్యాఖ్యానించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వాన, గాలి దుమారానికి భారీగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని భేటీలో తీర్మానించారు. వరిపంటకు ఎకరాకు రూ.20 వేలు, మిరప, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారమివ్వాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతుధరలకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.