కోదండరామ్‌కు క్షమాపణ చెప్పాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు క్షమాపణలు చెప్పాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రజా ఉద్యమాల పట్ల టీఆర్‌ఎస్ సర్కార్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ఈ ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొంది. గురువారం సీపీఎం నాయకులు జి.నాగయ్య, బి.వెంకట్, టి.జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య, నిరంకుశ విధానాలపై పునరాలోచించుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు.
మార్చి 19న సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం...
సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా వచ్చేనెల 19న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ‘తెలంగాణ సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం’ పేరిట సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దీనిని పార్టీ కార్యక్రమంగా కాకుండా, రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా నిర్వహిస్తామన్నారు. సామాజిక, ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు, అభ్యుదయ, ప్రజాతంత్ర వాదులంతా భాగస్వాములు కావాలని కోరారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభలో వామపక్ష పార్టీల నేతలు, సామాజిక తరగతులకు చెందిన నాయకులు, మేధావులు, తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. జేఏసీ చైర్మన్ కోదండరాంకు, వివిధ సంఘాలకు, పార్టీల నేతలకు ఆహ్వానాలు అందజేస్తామన్నారు.