సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న జాక్టో నాయకులు(ఫైల్)
సాక్షి, కరీంనగర్ : ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు.. ఉద్యోగ విరమణ అనంతరం నెలనెలా సరిపడినంత పింఛను వస్తోందని ప్రభుత్వ కొలువులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న సీపీఎస్ విధానం ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తోంది. మూడు దశాబ్దాలు ప్రజలకు సేవ చేసి, రిటైర్డు అయిన తర్వాత తమకు, తమ కుటుంబాలకు సామాజిక భద్రత లేకపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. దేశవ్యాప్తంగా 60 లక్షల మంది, రాష్ట్రంలో లక్షా 25 వేల మందికి పైగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 13,000పైగా ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంలో కొనసాగుతున్నారు. భరోసా లేని పెన్షన్ విధానం వల్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(జాక్టో) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు, పాత పెన్షన్ పునరుద్ధరణకు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చారు.
పలుమార్లు ఆందోళనలు..
సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త విధానంతో తమకు భద్రత లేదని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016 నవంబర్ 29న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద టీఎస్‌యూటీఎఫ్, టీఎస్‌సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2016 డిసెంబర్ 2న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం అందించారు.
సీపీఎస్ విధానం అమలు..
సీపీఎస్ విధానాన్ని కేంద్రం 2004 జనవరి 1 నుంచి అమలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమలు చేసింది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మూల వేతనం, డీఏలతో 10 శాతం మొత్తానికి ప్రభుత్వ వాటా, 10 శాతం ఉద్యోగి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లిస్తారు.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి..
జమ చేసిన మొత్తాన్ని ప్రైవేటు ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తారు. వారు వివిధ ఫండ్‌లో, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి రిటైర్డ్‌మెంట్ సందర్భంగా అప్పటి మార్కెట్ విలువల ఆధారంగా ఖాతా నిల్వలోని 60 శాతం మొత్తాన్ని నగదుగా చెల్లిస్తారు. మిగతా 40 శాతం పింఛన్‌గా నిర్ణయిస్తారు. మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లులోని 29(ఎఫ్)ప్రకారం రిటరŠన్స్ మీద ఎలాంటి గ్యారంటీ లేదు. రిటరŠన్స్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. అప్పటి ధరకు అనుగుణంగా కరువు భత్యం, పీఆర్సీ పెరుగుదల ఈపీఎస్ పింఛనుదారులకు వర్తించదు. ఒక్కోసారి మార్కెట్ రిటరŠన్స్ వృద్ధి శాతం కనీసం బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నిల్వకు లభించే వడ్డీ 4 శాతం కూడా ఉంటుందనే భరోసా లేదని ఉద్యోగుల ఆవేదన.
పాత పింఛను విధానంతో లాభాలు..
2004కు ముందు నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే విరమణ పొందే సమయంలో తన చివరి మూల వేతనం(బేసిక్ పే)లో 50 శాతం పింఛన్‌గా నిర్ధారించి, ఆ మిగతా 50 శాతానికి అన్ని రకాల భత్యాలు(అలవెన్స్) కలుపుకొని చెల్లిస్తారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం పెంచినప్పుడు పింఛనుదారులకు ఇది వర్తిస్తోంది. ప్రభుత్వాలు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ద్వారా ఉద్యోగులతో పాటు అప్పటి ధరలకు అనుగుణంగా పింఛన్ మొత్తాన్ని పెంచుతారు.
కొత్త పథకం ఎవరికి లాభం?
నూతన పింఛన్ విధానంతో ఉద్యోగులకు, అసంఘటిత కార్మికులకు లాభం అన్నది అప్పటి ప్రభుత్వాల వాదన. ఇది నిజం కాదని ప్రభుత్వ ఉద్యోగుల వాదన. పాత పింఛన్ విధానం కన్న మెరుగైన పింఛను విధానం తీసుకొస్తామని, అసంఘటిత కార్మికులకు విస్తరిస్తామని చెప్పిన పాలకులు.. ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న ఆర్థిక భద్రతను దూరం చేసి సామాజిక భద్రతపై ఆందోళనను రేకేత్తించాయన్న విమర్శలు ఉన్నాయి.
హామీలు అమలు చేయాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విచారకరం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ పెన్షన్ విధానం అమలును ఎత్తివేసి పాతపెన్షన్‌ను పునరుద్ధరించాలి. 2018 మే 16న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి పదోన్నతులు, పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి. సెప్టెంబర్1న జరిగే ర్యాలీలు, ప్రదర్శనలు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు జయప్రదం చేయాలి.
– ఎస్. ప్రభాకర్‌రావు, జాక్టో జిల్లా కన్వీనర్
సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వాలు సవతితల్లి ప్రేమను చూపించడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ప్రయత్నించాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు, పీఆర్‌సీ, ఐఆర్ లాంటి సమస్యలను నాన్చడం సరికాదు. సెప్టెంబర్ 1న ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన ర్యాలీలు జయప్రదం చేయాలి.
– కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్‌జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment