ఉద్యమ బాట | Govt Employees Protest For CPS Cancelled In Karimnagar | Sakshi
Sakshi News home page

ఉద్యమ బాట

Published Wed, Aug 29 2018 1:02 PM | Last Updated on Wed, Aug 29 2018 1:02 PM

Govt Employees Protest For CPS Cancelled In Karimnagar - Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ఉద్యోగభద్రత మంచి జీతభత్యాలు...పదవీ విరమణాంతరం నెలానెలా సరిపడినంత పింఛను ఉంటుందని ప్రభుత్వ కొలువులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న సీపీఎస్‌ విధానం ప్రభుత్వ ఉద్యోగులను కలిచివేస్తోంది. ఉద్యోగ వివరమణ అనంతరం తమకు, తమ కుటుంబాలకు సామాజికభద్రత లేకపోవడంతో సీపీఎస్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. దేశ వ్యాప్తంగా 60 లక్షల మంది , రాష్ట్రంలో లక్ష 25వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ పథకంలో కొనసాగుతున్నారు. భరోసా లేని పెన్షన్‌ విధానం వల్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి(జాక్టో) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌1న సీపీఎస్‌ రద్దుకు, పాత పెన్షన్‌ పునరుద్ధణకు పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ  జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చారు.

 సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. 2016 నవంబర్‌ 29న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద టీఎస్‌యూటీఎఫ్, టీఎస్‌సీపీఎస్‌ఈఏ ధర్నా నిర్వహించారు. 2016 డిసెంబర్‌ 2న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం అందించామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

‘సీపీఎస్‌’ విధానమిలా.. 
సీపీఎస్‌ విధానాన్ని 2004 జనవరి 1 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమలు చేస్తోంది. ఈ పథకాన్ని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటరీ(పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) సమన్వయంతో అమలు చేస్తున్నారు. మూల వేతనం, డీఏలతో10శాతం మొత్తానికి ప్రభుత్వ వాటా, 10 శాతం ఉద్యోగి మ్యాచింగ్‌ గ్రాంటుగా చెల్లిస్తారు.

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి.. 
జమ చేసిన మొత్తాన్ని ప్రైవేటు ఫండ్‌ మేనేజర్లకు అప్పగిస్తారు. వారు వివిధ ఫండ్‌లో, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి విరమణ సందర్భంగా అప్పటి మార్కెట్‌ విలువల ఆధారంగా ఖాతా నిల్వలోని 60శాతం మొత్తాన్ని నగదుగా చెల్లిస్తారు. మిగతా 40శాతం పింఛన్‌గా నిర్ణయిస్తారు. మార్కెట్‌ ఒడిదొడుకులకు అనుగుణంగా తగ్గడం లేదా పెరగవచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లులోని 29(ఎఫ్‌)ప్రకారం రిటరన్స్‌ మీద ఎలాంటి గ్యారంటీ లేదు.రిటరŠన్స్‌ మార్కెట్‌పై అధారపడి ఉంటాయి.అప్పటి ధరకు అనుగుణంగా కరువు భత్యం, పీఆర్సీ పెరుగుదల ఈపీఎస్‌ పింఛనుదారులకు వర్తించదు. ఒక్కోసారి మార్కెట్‌ రిటరŠన్స్‌ వృద్ధి శాతం కనీసం బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నిల్వకు లభించే వడ్డీ 4 శాతం కూడా ఉంటుందని భరోసా లేదని ఉద్యోగుల ఆవేదన.
 
పాత పింఛను విధానంతో లాభాలు.. 
2004కు ముందు నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే ఉద్యోగవిరమణ సమయంలో తన చివరి మూల వేతనం(బేసిక్‌ పే)లో 50శాతం పింఛన్‌గా నిర్దారించి, ఆ మిగతా 50శాతానికి అన్ని రకాల భత్యాలు(అలవెన్స్‌)లు కలుపుకొని చెల్లిస్తారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం పెంచినప్పుడు పింఛనుదారులకు ఇది వర్తిస్తోంది. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ద్వారా ఉద్యోగులతో పాటు అప్పటి ధరలకు అనుగుణంగా పింఛన్‌ మొత్తాన్ని పెంచుతారు.

తీవ్ర అన్యాయం 
ఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పెన్షన్‌ మంజూరు చేస్తున్న ప్రభుత్వం 35 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్‌ లేదనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పెన్షన్‌ అనేది భిక్ష కాదు అని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాలకులు విస్మరించడం బాధకరం. నూతన సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. సెప్టెంబర్‌1న జరిగే విద్రోహ దినంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు సోదర సంఘాలన్ని కలిసి రావాలి. – దాముక కమలాకర్, సీపీఎస్‌ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement