
‘క్రిసెంట్’ పాపం ఎవరిది..?
‘క్రిసెంట్’ కళాశాల వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ఉదాసీనత.. పర్యవేక్షణలోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మంది జీవితాలతో యూజమాన్యం ఆటలాడుకున్నా స్పందించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అనుమతి లేకుండా ఏడాదిపాటు తరగతుల నిర్వహణ కొనసాగినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లా కేంద్రంలో ఏకంగా జిల్లా విద్యాశాఖాధికారి ముద్రలు సృష్టించి అనుమతులున్నట్లు ప్రైవేట్ పాఠశాలలను నడిపిన విషయం మరువకముందే క్రిసెంట్ సంఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన విద్యాశాఖలో కొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడ్డారు. చేయరాని పనులు చేస్తూ పట్టుబడి సంబంధిత శాఖ పరువును బజారుకీడుస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
తలాపాపం..
జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండానే డీఈడీ కళాశాలను నిర్వహిస్తూ 50 మంది విద్యార్థుల వద్ద ఫీజుల పేరిట రూ.కోటికిపైగా వసూలుచేసింది క్రిసెంట్ యూజమాన్యం. 2013-14 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ అనుమతి లభించకున్నా 50 మందిని నాన్ మైనార్టీ ద్వారా భర్తీ చేసుకుంది. ఏడాదిపాటు తరగతులు కూడా నిర్వహించింది. ఇటీవలే ప్రాక్టికల్‌కోసం నగరంలోని సప్తగిరికాలనీ, ధన్గర్‌వాడీ తదితర ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో డీఎడ్ విద్యార్థులతో బోధన చేయించింది. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో హాల్ టికెట్ల కోసం రేపుమాపూ అంటూ యాజమాన్యం తిప్పుకుని బుధవారం పరీక్ష టైం వరకు చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు.
అనుమతులేవీ...
ఏదైనా విద్యాసంస్థ నెలకొల్పాలంటే క్రీడా మైదానం, మౌలిక వసతులు, ఫైర్‌సర్టిఫికెట్‌పాటు విద్యాశాఖకోరిన ధ్రువపత్రాలు సమర్పించాలి. అరుుతే అవేమీ లేకుండానే యూజమాన్యాలు అమ్యామ్యాలతో అధికారులను మచ్చిక చేసుకుని అనుమతి తీసుకుంటున్నారుు. తనిఖీల సమయంలో అధికారులు డబ్బులు తీసుకుని అంతా ఓకే అంటూ నివేదికలు ఇచ్చేస్తున్నారు. పరీక్షల సమయంలో తమకున్న పలుకుబడితో యథావిధిగా తమ పనులు ముగించుకోవడం విద్యాసంస్థలకు రివాజుగా మారింది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...
డీఈడీ పరీక్షలకు హాజరుకాలేక విద్యాసంవత్సరం కోల్పోయిన క్రిసెంట్‌కళాశాలకు చెందిన 50మంది విద్యార్థులు గురువారం కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తల్లిదండ్రులతోపాటు టూటౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ నరేందర్‌కు కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని, విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేలా చూడాలని విద్యార్థులు వేడుకున్నారు.
బాధిత విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచారుు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నాయకులు బండారి శేఖర్, నాగరాజు, బోనగిరి మహేందర్, రాజునాయక్ డిమాండ్‌చేశారు.
క్రిసెంట్ ప్రిన్సిపాల్,కరస్పాండెంట్‌పై కేసు
కరీంనగర్ క్రైం: విద్యార్థులనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి నిలువునా ముంచిన క్రిసెంట్ డీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై కేసు నమోదుచేశారు. మేనేజ్‌మెంట్ కోటాలో సుమారు 50మంది విద్యార్థులకు సీట్లు కేటాయించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది. అయితే కళాశాలకు అనుమతి రాకపోవడంతో పలువురు విద్యార్థులు రోడ్డునపడ్డారు. రెండురోజుల పాటు ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధిత విద్యార్థులు గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు క్రిసెంట్ కరస్పాండెంట్ జాహీర్ ఖలీద్, ప్రిన్సిపాల్ హమ్మదుల్లా బేగ్‌పై కేసు నమోదు చేశామని సీఐ నరేందర్ తెలిపారు.