మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న రైతులు, మంటలను చల్లార్చుతున్న అగ్నిమాపక సిబ్బంది
నిజాంసాగర్(జుక్కల్) : పంట పొలాల్లో చెలరేగిన మంటలు రైతులకు ముచ్చెమటలు పట్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం నిజాంసాగర్ మండలం నర్వ, అన్నసాగర్ గ్రామ శివారులో పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. యాసంగి పంట నూర్పిడి చేసిన పొలాల్లో చెలరేగిన అగ్ని కీలలు.. కల్లాల్లో, కొయ్యకాల్లో నిల్వ ఉన్న ఎండుగడ్డికి వ్యాపించాయి. సుమారు 50 ఎకరాల మేర వ్యాపించిన మంటలు.. నర్వ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాయి.
గ్రామ శివారులో వరి పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టారు. దూర ప్రాంతాల నుంచి తగలబడుకుంటూ వచ్చిన మంటలు ధాన్యం కుప్పలకు వద్దకు రావడంతో స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మంటలను ఆర్పేడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో విపరీతమైన గాలులు వీయడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు ఎల్లారెడ్డి అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు మూడు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్‌సిబ్బంది వేగంగా స్పందించడంతో ధాన్యం కుప్పలకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సుమారు రూ.10 లక్షల విలువైన ధాన్యాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. దీంతో ఇన్‌చార్జి ఫైర్ అధికారి గంగాధర్, పైర్‌మెన్లు సంతోష్‌కుమార్, అబ్దుల్ సలాం, శ్రీకాంత్‌లను సర్పంచ్ గొట్టం అనుసూజ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్ స్థానికులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment