వడ్డీకి ఎగనామం!
పంట రుణాలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఏడాదికిపైగా పంట రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లించకుండా మొం డికేసిన రాష్ట్ర సర్కారు మరోసారి అదే పం థాను ఎంచుకుంది! తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వడ్డీ లేని రుణాలకు రూ.150 కోట్లే కేటాయించింది. దీంతో కరువు కాలంలో రైతులకు పంట రుణాల పంపిణీ ప్రశ్నార్థకమైంది. గతేడాది పంట రుణాల వడ్డీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు రూ.250 కోట్లకుపైగా బాకీ పడింది. పాత బకాయిలను పక్కనపెట్టినా.. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం ప్రకారం ఈ ఏడాది పంట రుణాలపై వడ్డీ చెల్లింపులకు కనీసం రూ.500 కోట్లు కావాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా అందులో మూడో వంతు కంటే తక్కువగా బడ్జెట్ కేటాయింపులుండటం విస్మయపరుస్తోంది.
నిరుటి నుంచి నిర్లక్ష్యం
రాష్ట్రంలో వడ్డీ లేని పంటరుణాల పథకం కింద దాదాపు 30 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ప్రకారం రైతులు తీసుకున్న పంట రుణాలపై చెల్లించాల్సిన 7% వడ్డీలో కేంద్రం 3%, రాష్ట్ర ప్రభుత్వం మిగతా నాలుగు శాతం బ్యాంకులకు చెల్లిస్తాయి. కానీ నిరుటి నుంచి ఈ వడ్డీ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం బ్యాంకులు క్లెయిమ్ చేసిన మూడో రోజున ప్రభుత్వం ఆ నిధులు రీయింబర్స్ చేయాలి. కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు మొండిచేయి చూపిస్తోంది. గతేడాది దాదాపు రూ.250 కోట్లు బాకీ పడింది. వడ్డీ సొమ్ము చెల్లించాలని బ్యాంకులు వరుసగా లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బ్యాంకర్లు రైతులకు రుణాలివ్వకుండా తిప్పుకుంటున్నారు.
రుణం పెరిగితే వడ్డీ పెరగదా?
ఈ ఏడాది పంట రుణాల పంపిణీ లక్ష్యం ఎంతో ప్రభుత్వానికి తెలియంది కాదు! రైతుల ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్‌లో స్పష్టమైన అంచనాలు, కనీసం దరిదాపు కేటాయింపులు చేసుకోవటం తప్పనిసరి. కానీ అవేమీ పట్టిం చుకోకుండా వడ్డీకి నామమాత్రంగా విదిలింపులు చేయటం గమనార్హం. దీంతో పంట రుణాల పంపిణీకి చిక్కులు తలెత్తనున్నాయి. గతేడాది రూ.18,420 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయగా.. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది రూ.27,799 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇం దులో రూ.25 వేల కోట్ల మేరకు లక్ష్యం నెరవేరుతుందని అంచనా వేసినా.. అదే స్థాయిలో వడ్డీ పెరుగుతుంది. గడువులోగా పంట రుణాలు తిరిగి చెల్లించిన వారికే వడ్డీ లేని రుణ పథకం వర్తిస్తుంది. ఈ నిబంధన పరిధిలో అర్హత పొందే రుణ మొత్తం 50 శాతానికి మించదని అంచనా వేస్తోంది. ఈ లెక్కన దాదాపు రూ.12,500 కోట్లకు వడ్డీ చెల్లించటం తప్పనిసరి. అందులో 4% (రూ.500 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తన వాటాగా రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్‌లో తూతూ మంత్రంగా రూ.150 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.
రబీ రుణాలపై ప్రభావం
రాష్ట్ర సర్కారు తీరు రబీ రుణాల పంపిణీపై ప్రభావం చూపుతోంది. పంట రుణాల పంపిణీకి బ్యాంకులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. రుణాల కోసం వచ్చే రైతులను బ్యాంకులు రకరకాల కుంటిసాకులతో తిప్పి పంపుతున్నాయి. కరువు దుర్భిక్ష పరిస్థితులకు తోడు బ్యాంకర్ల వైఖరి రైతులకు అశనిపాతంగా మారింది. బ్యాంకు రుణాలకు నోచుకోని రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.27,799 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటే ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణ పంపిణీ జరిగింది. ఖరీఫ్‌లో రూ.18,092 కోట్ల పంట రుణ లక్ష్యం కాగా.. రూ. 12,938 కోట్లు ఇచ్చారు. రబీ పంట రుణ లక్ష్యం రూ.9,707 కోట్లు కాగా.. రూ.5 వేల కోట్లు దాటలేదు. రబీ పంట రుణాల పంపిణీ ఇంచుమించు సగానికే ఆగిపోవడం గమనార్హం.