వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1.46 లక్షల కోట్లు! | Agricultural Credit Scheme at above Rs 1lakh crore in AP | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1.46 లక్షల కోట్లు!

Published Mon, Jun 1 2020 3:45 AM | Last Updated on Mon, Jun 1 2020 1:05 PM

Agricultural Credit Scheme at above Rs 1lakh crore in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020–21)లో వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,46,302 కోట్లుగా అధికారులు తాత్కాలిక అంచనా వేశారు. ఇందులో పంట రుణాలు రూ.1,05,034 కోట్లు కాగా వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.41,268 కోట్లున్నాయి. ఎక్కడా విత్తనాల కొరత లేకపోవడం, రైతు భరోసా ద్వారా అన్నదాతలకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందుతుండటం, పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున గత ఖరీఫ్‌లో అంచనాలను మించి అదనంగా 17.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదైంది. ఈసారి ఖరీఫ్‌లో 90.15 లక్షల ఎకరాలు సాగు కావచ్చని అంచనా వేస్తున్నా రైతన్నలకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే సర్టిఫైడ్‌ విత్తనాలు అందుబాటులోకి రావడం, ఎరువుల దగ్గర నుంచి రైతులకు ఏది కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుండటంతో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

రికార్డు స్థాయిలో సాగు, దిగుబడులు..
అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 172 లక్షల మెట్రిక్‌ టన్నులు నమోదైంది. గత ఖరీఫ్‌లో 87.80 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా అంచనాలను మించి 105.65 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదు కావడం విశేషం. గత ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా రూ.6,594 కోట్లను 46.69 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందచేసింది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక చొరవ చూపి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి నమోదైంది. అంతే కాకుండా కరోనా కష్ట కాలంలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏకంగా రూ.2,200 కోట్లను ధరల స్ధిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం వ్యయం చేసింది. 

ఆర్బీకేలతో విత్తనాలకూ ‘భరోసా’
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, ఏపీఎస్‌ఐడీసీ కింద రాష్ట్రంలో 90.15 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అధికారులు ముందస్తు అంచనా వేశారు. అయితే గతేడాది లెక్కలను బట్టి చూస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా రైతు భరోసా ద్వారా ఈ సంవత్సరం తొలి విడతగా ఇప్పటికే రూ.3,675 కోట్లను నేరుగా 49.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో మే 15వ తేదీనే నగదు జమ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్నదాతలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాల సరఫరాను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8.43 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై గ్రామాల్లో పంపిణీ చేశారు. 


ఎరువులు బఫర్‌ స్టాక్‌
రైతులందరికీ నూటికి నూరు శాతం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందచేయడమే కాకుండా పంట రుణాలను అందజేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది. ఈ–పంట పోర్టల్‌లో నమోదైన రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలను అందజేయనున్నాయి. రైతులకు ఎరువులు కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరానికి మించి బఫర్‌ స్టాక్‌ సిద్ధం చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 17.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులకుగానూ ఇప్పటికే 11 లక్షల మెట్రిక్‌ టన్నులను సిద్ధంగా ఉంచారు. 1.39 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కూడా అందుబాటులో ఉంది. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

రుణాలకూ ఇబ్బంది లేదు..
వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావడంతో ఇక రైతులకు అవసరమైన అన్ని  సదుపాయాలు గ్రామంలోనే అందనున్నాయి. గతంలో రైతులు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా  మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. అదునులో విత్తనాలు లభ్యం కాక అవస్థలు ఎదుర్కొనేవారు. ఇప్పుడు రైతులకు ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అసిస్టెంట్‌లు, ఉద్యాన అసిస్టెంట్‌లు, సెరికల్చర్‌ అసిస్టెంట్లు రైతులకు చేదోడువాదోడుగా ఉంటారు. సాగు చేస్తూ ఇప్పటివరకు రుణాలు పొందని రైతులను గుర్తించి దగ్గరలోని బ్యాంకుల్లో నమోదు చేయిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement