హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రకటించిన మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు పదిరోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టు తొలిదశకు రూ.14,590 కోట్లతో పరిపాలనా అనుమతుల ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం నాలుగైదు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు నేడు లేదా రేపటిలోగా వెలువడే అవకాశమున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.
మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం గతేడాది జూన్‌లోనే నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీపై వెనువెంటనే రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల తొలిదశ పనుల డీపీఆర్ జనవరిలోనే ప్రభుత్వానికి చేరగా.. దానిలో కొద్దిపాటి మార్పులు చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచించింది. సీడీవో సూచించిన మార్పులతో ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ. 16,000 కోట్లకు చేరింది.
ఈ అంచనాలను పరిశీ లించిన ఆర్థిక శాఖ ఎట్టకేలకు రూ.14,590 కోట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీకి బయల్దేరే ముందు ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. జూరాల నుంచి 60 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టులో బాగంగా మూడు జలాశయాలు నిర్మించాల్సి ఉంది. తొలి దశలో కోయిల్‌కొండ రిజర్వాయర్ వరకే పరిమితం కానున్నారు. 70 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌కు జూరాల నుంచి అయిదు కిలోమీటర్ల ఒపెన్ చానల్, 22 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో దీనికింద ముంపునకు గురయ్యే గ్రామాలు, నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది.
పాలమూరు ఎత్తిపోతలకు రూ.14,590 కోట్లు
Published Fri, Feb 6 2015 12:40 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Advertisement