
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ నూతన పోలీసు కమిషనర్ ఎవరనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో నూతన కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయం పోలీసులతో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మూడు జిల్లాల పరిధి..
హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు పేరు ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలకు విస్తరించిన పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకమన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఆశావహుల పేర్లపై జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా సీఎం తీసుకున్నట్లు సమాచారం. నూతన కమిషనర్ నియామకంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రచారంలో ఆరుగురు..
అత్యంత కీలకమైన వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎవరు రానున్నారనే అంశంపై పోలీసు శాఖతోపాటు ప్రజల్లో చర్చ జరుగుతుండగా, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న వీబీ.కమలాసన్ రెడ్డి, రామగుండం సీపీ వి.సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు కమలాసన్ రెడ్డి పేరు ఖరారైనట్లేనన్న వాదన కూడా ఉంది. అయితే సుమారు నాలుగేళ్లుగా కరీంనగర్ కమిషనర్‌గా పని చేస్తున్న కమలాసన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రయత్నం ఫలిస్తే సత్యనారాయణకుఅవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. అదే విధంగా గతంలో వరంగల్‌లో డీఎస్‌పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా ఉన్న బి. సుమతి, నిజామాబాద్ సీపీ కార్తికేయ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ పి.విశ్వప్రసాద్, హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్(స్పెషల్ బ్రాంచ్) డాక్టర్ తరుణ్‌జోషి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే పదోన్నతి పొంది డీఐజీ హోదాలో కరీంనగర్ సీపీగా వీబీ.కమలాసన్ రెడ్డి పని చేస్తుండగా, నిజామాబాద్ సీపీ కార్తికేయ, ఎస్పీ(ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) బి.సుమతి, రామగుండం సీపీ వి.సత్యనారాయణకు ఈ ఏడాది ఫిబ్రవరి 6న డీఐజీలుగా పదోన్నతి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment