సాక్షి, హైదరాబాద్: ‘అసలేం చేస్తున్నారు. అడవుల సంరక్షణను విస్మరించి తలాతోకా లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. వెంటనే పనితీరు మార్చుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకునేందుకు వెనుకాడను’ అంటూ ఐఎఫ్‌ఎస్ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం కార్యాలయంలోనే అటవీ శాఖ బాధ్యతలను ముగ్గురు ఉన్నతాధికారులకు అప్పగించాం. ఇద్దరు ఐపీఎస్‌లు, ఓ ఐఏఎస్ ఇదే పనిలో ఉన్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? అడవులపై పర్యవేక్షణ లేకపోగా, ప్రభుత్వ కార్యక్రమాలను ఆటంకపరుస్తున్నారు. మీ అంతట మీరే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ అటవీ శాఖ, సీఎంవో అధికారుల తీరుపై మండిపడ్డారు. సంబంధిత అధికారులందరినీ మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌కు పిలిపించి మంత్రుల సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడో విడత హరితహారం అనుకున్నట్లుగా సాగడం లేదని, సరిపడా నియామకాలు చేపడుతుంటే అధికారులు సరిగా పనిచేయటం లేదని సీఎం మండిపడ్డారు. క్షేత్ర స్థాయికి వెళ్లకుండా అరణ్యభవన్‌లోనే ఉంటున్నారని, అవసరమైతే ఐఎఫ్‌ఎస్‌ల నుంచి ఈ సేవలను తప్పించి.. సమర్థంగా పని చేసే రాష్ట్ర అధికారుల సేవలను వాడుకుంటామని, వారికే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలిస్తామని అరణ్యభవన్, సీఎంవో ఆఫీసు అధికారులను హెచ్చరించారు.
అంత అవసరం ఏమొచ్చింది..?
ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయలను అటవీ శాఖ అధికారులు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటనపై అధికారుల ఎదుటే సీఎం పోస్ట్‌మార్టమ్ నిర్వహించినట్లు తెలిసింది. ‘గొత్తికోయల పట్ల ఈ చర్యలకు పాల్పడిందెవరు? అసలు గొత్తికోయలపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాడి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశించింది ఎవరు? చర్యలు తీసుకునే ముందు జిల్లా అధికారులు, లేదా రాష్ట్ర అధికారులు, స్థానిక పోలీసులకు.. ఎవరికైనా సమాచారమిచ్చారా? ఇస్తే ఎవరికిచ్చారు..? అన్ని వివరాలనూ ఇవ్వండి.. బాధ్యులపై చర్యలు తీసుకోండి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందనే కనీస అవగాహన లేని అధికారులున్నారా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల ఉరుకులు పరుగులు
సీఎం ఆగ్రహించడంతో అటవీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బుధవారం ఉదయాన్నే అరణ్య భవన్‌లో సమీక్ష నిర్వహించటంతోపాటు సచివాలయంలో సమావేశమై లోటుపాట్లను సమీక్షించుకున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, పీసీసీఎఫ్ పి.కె.ఝా, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి.
కనీస అవగాహన లేకుండా నివేదికలా?
అటవీ శాఖకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చుతున్నారంటూ అధికారులను సీఎం తప్పుబట్టారు. గోదావరిపై కాళేశ్వరం సమీపంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో ఎల్‌మడుగు మొసళ్ల సంరక్షణ కేంద్రానికి ముప్పు ఉందని కేంద్ర పర్యావరణ శాఖకు అటవీ శాఖ సమాచారమిచ్చింది. దీనిపై సీఎం మాట్లాడుతూ.. ‘అన్నారం బ్యారేజీ నీటి నిల్వ 10 కిలోమీటర్లకు విస్తరిస్తుంటే.. 14 కి.మీ. దూరంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి ముప్పేముంది? నీటిలో బతికే మొసళ్లకు నీటినిల్వతో ప్రమాదమేంటి? కనీస అవగాహన లేకుండా ఎందుకిలా తప్పుడు నివేదికలు పంపుతున్నారు?’ అంటూ నిలదీసినట్లు సమాచారం. ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకుండా వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ఇలానే విచిత్రంగా ఉన్నాయని మండిపడ్డారు. అసలు టైగర్‌లు లేని శ్రీశైలం పులుల అభయారణ్యంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు అనుమతులు ఆపుతున్నారని, హైదరాబాద్ నడిబొడ్డున కేబీఆర్ పార్కు వైల్డ్ లైఫ్ పార్కంటూ అభ్యంతరం చెబుతున్నారని పలు ఉదాహరణలను వారి ముందుంచారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అడ్డుపడే ఎకో టూరిజం లాంటి అటవీ శాఖ ప్రాజెక్టులను అవసరమైతే డీ నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment