డబ్ల్యూహెచ్‌వోపై ‘సైబర్‌ అటాక్‌’! | Cyber Attack On World Health Organization | Sakshi
Sakshi News home page

డబ్ల్యూహెచ్‌వోపై ‘సైబర్‌ అటాక్‌’!

Published Sun, Apr 26 2020 4:35 AM | Last Updated on Sun, Apr 26 2020 4:35 AM

Cyber Attack On World Health Organization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల కన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో)పై పడింది. కరోనా నుంచి మానవాళిని కాపాడేం దుకు వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థల భాగ స్వామ్యంతో కృషి చేస్తున్న ఆ ఆరోగ్యప్రదాయిని పేరుతో అక్రమంగా సొమ్ము సంపాదించాలన్న ఆశతో సైబర్‌ నేరగాళ్లు డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక పరిజ్ఞానాన్ని హైజాక్‌ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక్క వారంలోనే ఆ సంస్థకు చెందిన 450 ఈ మెయిళ్లు, పాస్‌ వర్డ్‌లు దొంగిలించి విరాళాలు ఇవ్వాలంటూ మోసపూరిత విజ్ఞాపనలను ఆన్‌లైన్‌లో పెట్టారు. కానీ సైబర్‌ నేరగాళ్లు దొంగిలించిన ఈ మెయిల్స్‌ లోని డాటాను డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడు ఉపయోగించకపోవడంతో అక్రమార్కుల పాచిక పారలేదు. వారి స్కెచ్‌ను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లను మరింత కట్టుదిట్టం చేసుకుంది. మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది.

‘కోవిడ్‌’ సాలిడారిటీ ఫండ్‌ పేరుతో
వాస్తవానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌–19పై అలుపెరగని యుద్ధం చేస్తోంది. ప్రతీ క్షణం ఈ వైరస్‌ పట్ల ప్రపంచంలోని అన్ని దేశాలను అప్రమత్తం చేస్తూనే, ఆర్థిక చేయూతనిస్తున్న దేశాలు, పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో వైద్య పరంగా సహకారం అందిస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ వెబ్‌ సైట్‌ లో ‘కోవిడ్‌ సాలిడారిటీ ఫండ్‌’పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగి డబ్ల్యూహెచ్‌వో పేరుతో నకిలీ ప్రకటనలను ఆన్‌లైన్‌ లో పంపుతున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించేందుకు విఫల యత్నాలు చేశారు. అందులో భాగంగానే వారం రోజుల్లోనే ఆ సంస్థ సిబ్బంది, భాగస్వాములు గతంలో ఉపయోగించే 450 ఈ మెయిల్స్, వాటి పాస్‌ వర్డ్‌లను లీక్‌ చేసి వాటి నుంచి విరాళాలు ఇవ్వాలంటూ ప్రపంచ వ్యాప్తంగా సందేశాలు పంపారు.

ఆ ఈ మెయిల్స్, వాటిలోని డాటాను డబ్ల్యూహెచ్‌వో సిబ్బంది, కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులు, కొన్ని భాగస్వామ్య సంస్థలు ప్రస్తుతం వినియోగిస్తున్నప్పటికీ, అది పాతది కావడం, విరాళాల సేకరణకు కొత్త డాటా ఉపయోగిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో దాన్ని గుర్తించగలిగింది. వెంటనే అప్రమత్తమై తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు,తమ మెయిల్స్‌కు కట్టుదిట్టమైన సైబర్‌ భద్రత ఏర్పాటు చేసుకుంది.ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌ లో వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో, గత ఏడాది కన్నా తమ సాంకేతిక పరిజ్ఞానంపై సైబర్‌ నేరగాళ్ల దాడి 5 రెట్లు పెరిగిందని ధ్రువీకరించింది.అదే విధంగా విరాళాల అభ్యర్థన ప్రకటనల పట్ల మెలకువతో ఉండాలని ప్రపంచ దేశాలను కోరింది. 

కలిసికట్టుగా పోరాడుదాం 
’ప్రపంచ మానవాళికి ఆరోగ్య సమాచారం అందించడమే మా ఏకైక లక్ష్యం. సైబర్‌ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు మా సూచనలు తెలుసుకుంటూ, మాకు సలహాలు ఇస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కోవిడ్‌ తో పాటు ఈ నేరాలపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం.’ – బెర్నార్డో మారియానో, ముఖ్య సమాచార అధికారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement