
ఆయన వెనకబడిన వర్గాల పక్షపాతి: డీఎస్
నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో డీఎస్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఘనంగా సత్కరించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల కోసం నిధులు కేటాయించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మరువలేరని, అన్ని వర్గాల ప్రజలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనేక ఉన్నత పదవులు చేపట్టిన వారిలో వెనుకబడిన వర్గాల వారు ఉండడం సంతోషకరమన్నారు. స్పీకర్, రాజ్యసభ ఎంపీ పదవులు బీసీలకు కేటాయించారని తెలిపారు. తన రాజకీయ జీవితంలో మున్నూరుకాపులు ఎంతగానో అండగా నిలిచారని, వారిని ఎప్పటికి మరిచిపోలేన్నారు. చదువులో, క్రీడల్లో రాణించే మున్నూరుకాపు విద్యార్థులకు ప్రోత్సహకాలు అందించాలని సూచించారు. మేయర్ ఆకుల సుజాత, మాజీ మేయర్ సంజయ్, మున్నూరుకాపు సంఘం నాయకులు దారం సాయిలు, జెడ్పీటీసీ పుప్పాల శోభ, కార్పొరేటర్లు లావణ్య, సూదం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.