'ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది'
హైదరాబాద్: సిరిసిల్లలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పర్యటనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దొంగ ఇసుక వ్యాపారం చేసేవాళ్లకి కూడా పౌరుషం ఉంటే ఎట్లా అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా.. ఉద్యమ సమయంలో మీరు దాడులు చేసినప్పుడు ఆంధ్ర పాలకులు మిమ్మల్ని ఇలానే కొట్టారా అని సూటిగా అడిగారు. కేటీఆర్ దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయనకు డిపాజిట్ వస్తే ముక్కును నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర పోలీసులు ఇలా చెయ్యలేదని అన్నారు.
కాంగ్రెస్‌ను విమర్శించడం దారుణం: గీతారెడ్డి
టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం దారుణమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అపాల్సింది పోయి ఇలా చెయ్యడం సబబేనా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందా, దళితులు అంటే ఇంత చిన్న చూపా సూటిగా అడిగారు. కేటీఆర్‌కు ఇది తగునా, ఇలాంటి వాటిపై స్పందించలేరా.. మానవత్వం లేని ఇలాంటి సంఘటనలు కనీసం ఖండించలేరా అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత ఇంకా కేటీఆర్‌కు రాలేదని అన్నారు. మాజీ స్పీకర్ మీరాకుమార్ సిరిసిల్ల పర్యటన విజయవంతం అయిందన్నారు. అంత పెద్ద నాయకురాలు స్వయంగా జైల్లో ఉన్న వారిని, బాధితులను పరమర్శించించారని.. అలాంటి వ్యక్తితో అబద్దాలు చెప్పించామని టీఆర్‌ఎస్ నాయకులు అనడం దారుణమన్నారు.