సీఎం అడుగుజాడల్లో నడుస్తా.. | Dasyam Vinay Bhasker Comments After Getting Chief Whip Post | Sakshi

సీఎం అడుగుజాడల్లో నడుస్తా..

Published Mon, Sep 9 2019 12:27 PM | Last Updated on Sun, Sep 22 2019 1:51 PM

Dasyam Vinay Bhasker Comments After Getting Chief Whip Post - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న చీఫ్‌ విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌

సాక్షి, వరంగల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లక్ష్మణుడిగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామన్నకు నమ్మిన బంటు హన్మంతుడిగా ఉంటా.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తానని ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులైన దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, మేథావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఏకతాటిపైకి తెచ్చిన సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయభాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమించినందుకు గులాబీ బాస్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఉద్యమకారుడిగా.. పార్టీ విధేయుడిగా గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిగా ఉంటూ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. కుటుంబం మొదటి నుంచీ తెలంగాణ సాధనకు పోరాటం చేసిందని, టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పటి నుంచి ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని అంకితభావంతో విజయవంతం చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్‌ నుంచి ఈ స్థాయికి వచ్చిన తాను ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి, పట్టుదల మరిచిపోలేనివని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అపార్ట్‌మెంట్‌ దర్శన్, స్లమ్‌ దర్శన్, అడ్డా ములాఖత్‌ తదితర కార్యక్రమాల చేపట్టి నిత్యం ప్రజలతో మమేకమయ్యానన్నారు. ఈ కార్యక్రమాలను చూసిన సీఎం కేసీఆర్‌ వరంగల్‌ నగరంలో మూడు రోజులు ఉండి మురికి వాడల్లో నివాసముండే వారికి 2000 ఇళ్లు  మంజూరు చేశారని, త్వరలోనే వాటిని అర్హులకు కేటా యించనున్నట్లు వివరించారు.


వినయ్‌భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌

సోమవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ఉన్న నేపథ్యంలో శాసనసభలో వ్యవహారాలు సజావుగా సాగేలా కృషి చేస్తానని వినయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షం, మిత్రపక్షం, స్వపక్షంతో సమన్వయంగా కొనసాగుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అన్ని బిల్లులు పాసయ్యేలా చూస్తానని చెప్పారు. పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయాన్ని దసరా నాటికి పూర్తి చేస్తామని, అదే రోజు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.సుధీర్‌కుమార్, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, డిప్యూటీ మేయర్‌ సిరాజొద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్, సుందర్‌రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయభాస్కర్‌ను పలువురు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement