dasyam vinay bhaskar
-
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు,కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం.. -
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ హిట్ కావాలి: ఎమ్మెల్యే దాస్యం
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’మూవీలో మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ అన్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది చిత్రం బృందం.ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి వారిద్దరూ కూడా సెట్ అయ్యారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’తెలిపారు. ‘ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువకుడి కథే ఇది. తండ్రి కలను నేరవేర్చటానికి కొడుకు పడ్డ కష్టం. తన ప్రేమ, భావోద్వేగాలను అందంగా చూపించే ప్రయత్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు’అని నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి అన్నారు. ‘కృష్ణ, సత్య పాత్రల్లో రిష్వి, విస్మయ అద్భుతంగా నటించారు’ అని డైరెక్టర్ రాజేష్ దొండపాటి అన్నారు. -
‘రామ్ అసుర్’పై ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ ప్రశంసలు
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామ్ అసుర్. చాందిని తమిళ్‌రాసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి సినిమా ను వీక్షించింది చిత్ర బృందం. (చదవండి: రామ్ అసుర్ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది. హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు. దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను* అన్నారు. -
చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. అదే విధంగా ఈ కేసులో... వినయ్ భాస్కర్ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కాగా టీఆర్ఎస్ తరఫున దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేసిన వరంగల్ వాసి
హన్మకొండ: సౌరశక్తి, ఎలక్ట్రిసిటీ రెండింటిని వినియోగించుకుంటూ బ్యాటరీతో నడిచే సైకిల్‌ను వరంగల్ రూరల్ జిల్లా యువకుడు తయారు చేశాడు. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు తయారుచేసిన ఈ సైకిల్‌ను గంట పాటు చార్జింగ్ పెడితే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రాజు తెలిపాడు. చార్జింగ్ అయిపోతే సాధారణ సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లవచ్చని పేర్కొన్నాడు. సుమారు రూ.20 వేల వ్యయంతో తయారు చేసిన ఈ హైబ్రిడ్ సైకిల్‌ను చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం హన్మకొండ బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా సైకిల్‌ను రూపొందించిన రాజును అభినందించారు. రాజును ప్రోత్సహించడానికి తాను ఒక సైకిల్ కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పర్యావరణహిత సైకిల్ వాడటం ద్వారా కాలుష్యాన్ని అరికట్టిన వాళ్లమవుతామని చీఫ్‌విప్ పేర్కొన్నారు. చదవండి: కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్ -
Warangal Municipal Corporation Election 2021: సార్.. టికెట్ ప్లీజ్..!
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి టీఆర్ఎస్ నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హన్మకొండలో గురువారం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఆశావహులు ఆయనను చుట్టుముట్టిన దృశ్యమే ఇది. - స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్‌తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో తొమ్మిది మందికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
ప్రభుత్వ చీఫ్ విప్‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సోమవారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత పని నిమత్తం వినయ్ భాస్కర్‌ను కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. రాహుల్‌పై ఇటీవల జరిగిన దాడికి, ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాహుల్‌పై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. పబ్‌కు వెళ్లడం తప్పుకాదని, దాడి జరగడం సరికాదని వ్యాఖ్యానించారు. గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకోవాలని.. సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఎవరు పడితే వాళ్లు కొడతారా అని ప్రశ్నించారు. రాహుల్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కాగా, ప్రకాశ్‌రాజ్‌తో భేటీకి సంబంధించి వినయ్ భాస్కర్ కూడా స్పందించారు. ఒక సినిమా వేడుకకు సంబంధించిన అంశంపై మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందని, సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనిమీద ప్రకాశ్‌రాజ్, రాహుల్ సిప్లిగంజ్ తనను కలిశారని వెల్లడించారు. రాహుల్‌తో పబ్‌లో జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. -
రాహుల్‌కు మద్దతుగా రంగంలోకి ప్రకాష్ రాజ్
సాక్షి, హైదరబాద్ : సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మద్దుతగా నిలిచారు. ఇటీవల గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో రితేశ్‌రెడ్డితోపాటు మరికొందరు రాహుల్‌పై బీర్ సీసాలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తనకు న్యాయం చేయాల్సిందిగా రాహుల్.. సోషల్ మీడియా వేదికగా ఇదివరకే మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పలువురు సింగర్లు కూడా రాహుల్‌కు న్యాయం జరగాలని సోషలో మీడియాలో పోస్ట్‌లు చేశారు. తాజాగా రాహుల్‌ను ప్రకాష్ రాజ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వద్దకు తీసుకువచ్చారు. సోమవారం అసెంబ్లీలో వినయ్‌భాస్కర్‌తో ప్రకాష్ రాజ్, రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడి గురించి ప్రకాష్ రాజ్.. వినయ్ భాస్కర్‌తో చర్చించినట్టుగా సమాచారం. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌కు అన్యాయం జరిగిందన్నారు. రాహుల్ వెంట తను ఉంటానని చెప్పారు. పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని.. ఇందుకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని అన్నారు. రాహుల్ తప్పేమీ లేనప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలని ప్రశ్నించారు. తన వ్యక్తిగత పని మీద వినయ్ భాస్కర్‌ను కలవడానికి వచ్చానని తెలిపారు. పబ్‌కు వెళ్లడం తప్పు కాదని.. పబ్లిక్ ప్లేస్‌లో 10 మంది కలిసి ఒక్కరిని కొట్టడం దారుణం అన్నారు. సినిమా వాళ్లయితే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాహుల్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 324, 34 రెడ్‌విత్, 354 సెక్షన్ల కింద రితేష్‌రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్ వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి -
పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. చిన్నారి మృతి!
-
పట్టణ ప్రగతిలో అపశ్రుతి!
సాక్షి, వరంగల్ అర్బన్: పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్‌తో మురుగు కాలువ పనులు చేస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నగరంలోని 43వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనులు కొనసాగుతున్నాయి. మురుగు కాలువను జేసీబీతో శుభ్రం చేస్తుండగా ఆ పక్కనే గోడకు తగలడంతో అది కూలిపోయింది. అదే సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది గోవిందరావుపేట మండల కేంద్రం. మృతురాలి తండ్రి వడ్రంగి పనిచేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చిన్నారుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు. -
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి..
-
మానస కేసు : ఒకరికి ఉద్యోగం, ఇల్లు, తక్షణ న్యాయం..
హన్మకొండ: మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య ) అయితే.. దిశకు జరిగిన న్యాయం తన కూతురు విషయంలో జరగడం లేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్వరూపతో పాటు గొల్ల కురుమల నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రుషికేష్వర్ రాజు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం హామీతో దీక్ష విరమణ.. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీతో మానస తల్లి గాదం స్వరూప దీక్ష విరమించారు. తన కూతురు చావుకు కారణమైన దోషులకు శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వరూప గత 9 రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్షాస్థలికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. -
సీఎం అడుగుజాడల్లో నడుస్తా..
సాక్షి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లక్ష్మణుడిగా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నకు నమ్మిన బంటు హన్మంతుడిగా ఉంటా.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, మేథావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఏకతాటిపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించినందుకు గులాబీ బాస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుడిగా.. పార్టీ విధేయుడిగా గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిగా ఉంటూ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. కుటుంబం మొదటి నుంచీ తెలంగాణ సాధనకు పోరాటం చేసిందని, టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఉద్యమ నేతగా కేసీఆర్ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని అంకితభావంతో విజయవంతం చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ నుంచి ఈ స్థాయికి వచ్చిన తాను ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి, పట్టుదల మరిచిపోలేనివని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అపార్ట్మెంట్ దర్శన్, స్లమ్ దర్శన్, అడ్డా ములాఖత్ తదితర కార్యక్రమాల చేపట్టి నిత్యం ప్రజలతో మమేకమయ్యానన్నారు. ఈ కార్యక్రమాలను చూసిన సీఎం కేసీఆర్ వరంగల్ నగరంలో మూడు రోజులు ఉండి మురికి వాడల్లో నివాసముండే వారికి 2000 ఇళ్లు మంజూరు చేశారని, త్వరలోనే వాటిని అర్హులకు కేటా యించనున్నట్లు వివరించారు. వినయ్‌భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో శాసనసభలో వ్యవహారాలు సజావుగా సాగేలా కృషి చేస్తానని వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షం, మిత్రపక్షం, స్వపక్షంతో సమన్వయంగా కొనసాగుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అన్ని బిల్లులు పాసయ్యేలా చూస్తానని చెప్పారు. పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయాన్ని దసరా నాటికి పూర్తి చేస్తామని, అదే రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎం.సుధీర్‌కుమార్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, సుందర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయభాస్కర్‌ను పలువురు సన్మానించారు. -
దాస్యం: అభివృద్ధి చేశా.. గెలిపించండి
సాక్షి, హన్మకొండ: నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముం దుంచానని తనను ఆశీర్వదించి గెలిపించాలని వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని గాంధీ నగర్, అశోక కాలనీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు వెంట రాగా శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. ఓటర్లను నేరుగా కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనను ప్రజలు ఆదరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనకు విజయాన్ని చేకూరుస్తాయన్నారు. వరంగల్ పశ్చిమలో విచిత్ర పోటీ నెలకొందన్నారు. స్థానికుడికి...స్థానికేతరుడికి జరుగుతున్న పోటీ అని అన్నారు. ప్రచారంలో రైతు విమోజన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, నల్ల సుదాకర్‌రెడ్డి, సుందర్రాజు, నక్క లింగయ్య యాదవ్, జక్కుల రవి యాదవ్, బొల్లు రవి యాదవ్, శాగల్ల శ్రీనివా స్, బత్తిని శ్రీనివాస్, విప్లవ్‌రెడ్డి, బొల్లు సత్యం యాదవ్, మూగల కుమార్, బంక శ్రీనివాస్ యాదవ్, బంక అవినాష్ యాదవ్ పాల్గొన్నారు. -
వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్!
హన్మకొండ : వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక విధానంపై మాట్లాడారు. వినయ్‌భాస్కర్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. వరంగల్‌లో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు. టెక్స్టైల్ రంగంలో ప్రత్యేకమైన ఇన్సెంటీవ్‌ను వరంగల్, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో నెలకొల్పడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఆజాంజాహి మిల్లు మూతతో దాదాపు 30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. దీంతో ఆ ప్రాంతం వెలవెల బోతుందన్నారు. కేసీఆర్ సీఎం కావడం, వరంగల్‌ను పారిశ్రామిక కారిడార్‌గా మార్చుతామనడం సంతోషంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయనే నమ్మకం ఉందన్నారు. ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత.. మహిళలు, బీసీ, మైనారిటీలకు ఇన్సెంటీవ్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. నూతన పారిశ్రామిక విధానంలో స్కిల్ డెవలప్మెంట్కు ఏదైన కార్యక్రమం తీసుకుంటున్నారా అన్నారు. ఇన్నోవేటీవ్, ఇన్క్యూబిరేట్,ఇన్కార్పొరేట్ విధానం ద్వారా లబ్ధి జరుగుతుందో తెలియజేయాలని కోరారు. అదేవిధంగా బిల్ట్‌లో 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అడిగారు. -
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్
వరంగల్హన్మకొండ చౌరస్తా :జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించినట్టు చెప్పారు. జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, జాతీయ కోచ్ నాగపురి రమేష్, అసోసియేషన్ బాధ్యుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పక్షాన ఎమ్మెల్యే, కోచ్‌లను శాలువాతో సత్కరించారు. బెస్ట్ అథ్లెటిక్స్ : బాలురు ఓవరాల్ బెస్ట్ అథ్లెటిక్స్ గా అండర్-14 విభాగరంలో అరవింద్(మహబూబ్‌నగర్), అండర్-16లో ఈశ్వర్దత్మెయితా(హైదరాబాద్), అండర్-18లో సుధాకర్(ఖమ్మం), అండర్-20 విభాగంలో అగస్టీన్ ఏసుదాస్(రంగారెడ్డి) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు. బాలికలు.. అండర్-14 బాలికల విభాగంలో కవిత(కరీంనగర్), అండర్-16లో నిత్య(హైదరాబాద్), అండర్-18లో సుజాత(ఆదిలాబాద్), అండర్-20 విభాగంలో శ్రీలేఖ(వరంగల్) ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లో.. బాలురు లాంగ్‌జంప్ అండర్-14 బాలుర విభాగంలో పాండునాయక్ (మహబూబ్‌నగర్), డిస్కస్ త్రో లో అండర్-16లో సాహిల్(హైదరాబాద్), హార్డిల్స్ అండర్-18లో కిరణ్‌కుమార్(ఖమ్మం), షాట్‌పుట్ అండర్-20 విభాగంలో అంకిత్‌కుమార్(హైదరాబాద్), 1500 మీటర్ల పరుగుపందెం అండర్-20 విభాగంలోకృష్ణయ్య (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు. బాలికలు.. బాలికల విభాగంలో డిస్కస్ త్రో అండర్-16లో సాయిప్రియాంక(కరీంనగర్), 200 మీటర్ల పరుగుపందెం అండర్-18లో విశాలాక్షి (రంగారెడ్డి), 1500 మీటర్ల రన్నింగ్ అండర్-20 విభాగంలో వి.నవ్య(నల్లగొండ) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు. వీరికి స్పోర్ట్స్ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేశారు. -
అమ్మా.. నేను దాస్యం వినయ్‌భాస్కర్..
అమ్మా.. నేను దాస్యం వినయ్భాస్కర్ని. మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను. అసెంబ్లీ సమావేశాలున్నయ్. ఆదివారాల్లో హన్మకొండకు వస్తా. ఒక రోజు ప్రత్యేకంగా ప్రోగ్రాం పెడదాం. రెవెన్యూ, మునిసిపల్, పోలీసు అధికారులను ఇక్కడికే తీసుకొచ్చి అన్ని మాట్లాడుకుందాం. ఒక నెలలో ఎంతో కొంత పురోగతి ఉండేలా చూస్తా. వాస్తవంగా ఇది చెరువు శిఖం. ఇక్కడ పట్టాలు ఇవ్వరు. అయినా సీఎం కేసీఆర్‌తో చెప్తా. హైకోర్టులో తీర్పు ఉంది. హైకోర్టులో కొట్లాడి న్యాయం చేసేలా ప్రయత్నిస్తా. ఒకరు రోడ్డు మీద, మరొకరు మోరీ మీద.. ఇలా ఇష్టం వచ్చినట్లు ఇళ్లు కట్టుకోవద్దు.. వెళ్లొస్తా.. వినయ్‌భాస్కర్ : మీ బస్తీ పేరేందమ్మా? ఎన్నాళ్లుగా ఉంటున్నరు? మీ సమస్యలేంటి? భద్రమ్మ : దీన్‌దయాళ్‌నగర్. చాన్నాళ్ల్ల నుంచి ఉంటున్నం. నీళ్లు వస్తలేవ్, నల్లాలు కావాలె. రోడ్లు, మోరీలు కట్టియ్యాలె. వినయ్‌భాస్కర్ : ఏం చేస్తవ్ తమ్ముడు? సంపత్ : టీచర్ ట్రైనింగ్. హన్మకొండ డైట్ కాలేజీలో చేస్తున్న. వినయ్‌భాస్కర్ : ఇక్కడ ఎన్నేండ్ల నుంచి ఉంటున్నవ్? సంపత్ : 24 ఏండ్లు. ఇక్కన్నే పుట్టిన. వినయ్‌భాస్కర్ : నాన్న ఏంజేస్తడు? సంపత్ : మేస్త్రీ పని. వినయ్‌భాస్కర్ : రూ.110 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నరా? సంపత్ : చేసుకోలేదు. వినయ్‌భాస్కర్ : చదువుకున్నోళ్లు.. చెప్పాలె కదా? సంపత్ : సంఘం నుంచి చేసుకున్నడు. వినయ్‌భాస్కర్ : లేబర్ సంఘమా.. పేరేంది? నాన్నకు కచ్చితంగా ఇన్సురెన్సు చేసుకోవాలని చెప్పు. ఇంకేం సమస్యలు ఉన్నయ్ తమ్ముడు? సంపత్ : దాదాపు 70 శాతం మందికి టాయిలెట్స్ లేవు. ఆడవాళ్లు బయటికి వెళ్లాల్సి వస్తోందన్న.. వినయ్‌భాస్కర్ : బస్తీలో ఎంత మంది ఉంటరు.. సమస్య పోవాలంటే ఏం చేయూలె? సంపత్ : 10 చొప్పున మూడు యూనిట్లు(30 టాయిలెట్స్) సరిపోతయన్న. వినయ్‌భాస్కర్ : మరి నిర్వహణ ఎట్ల? సంపత్ : 4 యూత్ క్లబ్ ఉన్నయన్న. నాలుగు యూనిట్లు కడితే నిర్వహణలో ఇబ్బంది లేకుండా చూసుకుంటం. వినయ్‌భాస్కర్ : అచ్చ.. ఇక రోడ్లు, డ్రెయిను, నీళ్లు కావాలె. ఇవే కదా.. సంపత్ నీ కోర్సు ఎప్పడయిపోతది. జాబ్ వస్తదా..? సంపత్ : ఈ ఇయర్ అయిపోతదన్న. జాబ్ సాధిస్తా.. వినయ్‌భాస్కర్ : ఆల్ ది బెస్ట్ సంపత్. సంపత్ : థ్యాంక్స్ అన్నా.. వినయ్‌భాస్కర్ : హలో తమ్ముడు, ఏం విషయాలు? సర్కస్ రాజు : పదేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నం సార్. సర్కస్‌లు చేస్తం సార్. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేరు. మా సర్కస్ల 30 మంది దాకా ఎల్తరు. మేం నక్కలోళ్లం సార్. 100 గుడిసెలు ఉంటయి. వినయ్‌భాస్కర్ : మీది ఏ ఊరు. ఎక్కడ గుడిసలేసుకున్నరు? సర్కస్ రాజు : మాది రోకళ్ల శాయంపేట సార్. ఇక్కడికొ చ్చి ఐదేండ్లయితాంది. మన వాడకు గుడిసెలేసుకున్నం. వినయ్‌భాస్కర్ : రేషన్ కార్డు ఉన్నదా? సర్కస్ రాజు : కొందరికున్నయి.. కొందరికి రాలే సార్. వినయ్‌భాస్కర్: ఎంత మంది పిల్లలు. చదువుకుంటున్నారా? కార్డు ఎక్కడ కావాలె. ఇక్కడ్నా? రోకళ్ల శాయంపేటల్న? సర్కస్ రాజు : పెద్దలు మీరు ఉన్నరు. ఎక్కడైనా పర్వాలేదు.. మీ దయ. స్థలం కావాలె. ఇళ్లు కావాలె. వినయ్‌భాస్కర్ : అమ్మా.. మీ బస్తీల ఏం సమస్యలు ఉన్నయి. గతంలో ఎవరికన్నా చెప్పిండ్రా? ఎల్లమ్మ : 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. మస్తు సమస్యలు ఉన్నయి. రోడ్లు సక్కగలేవు. తాగడానికి నీళ్లు లేవు. ట్యాంకర్లు వచ్చి పోస్తయి. రోజూ రావు. కార్పొరేటర్, నగర పెద్దలకు చెప్పినం. ఒక్క తట్ట మట్టి పోయలేదు. వినయ్‌భాస్కర్ : అమ్మా కిరాణం షాపు యాపారం ఎట్లుంటది. రోజుకు లాభం ఎంతొస్తది. పిల్లలు ఏం జేస్తున్నరు. శ్రీలత : రోజు రూ.500 గిరాకవుతది. రూ.50 వరకు లాభముంటది. పాప ఏడో తరగతి. బాబు ఒకటో తరగతి. నక్కలగుట్ట శ్రీచైతన్యలో చదువుతాండ్లు. 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. రోడ్లు, లైట్లు పెట్టాలె. సరోజన : ఫస్ట్ గుడిసె మాదే. మణిరాం మేము వేసినం. పట్టాలు లేవు.. రోడ్లు లేవు.. నీల్లుగావాలె. మోరీలు సాప్లేదు.. స్తంభాలు లేవు. మొదట 15 గుడిసెలు ఉండె. ఇప్పుడు 750 గుడిసెలు ఉన్నయి. 3 వేల మంది ఉన్నరు. కష్టపడి ఇండ్లు కంటున్నం. ఇంటి నంబర్లు వచ్చినయి. పట్టాల కోసం కలెక్టర్ ఆఫీసు కాడికి పోతే ఒక్కొక్కర్ని లేబట్టి ఎత్తేసి కొట్టిండ్రు. వినయ్‌భాస్కర్ : ఎప్పుడయ్యిందమ్మా.. ఎవరు రాలేదా? సరోజన : పదేండ్ల కింద.. ఎవలు రాలె. అప్పడో కలెక్టరమ్మ వచ్చి సూసింది.. పోయింది.. ఇప్పుడు మీరే కాదుసారూ. తెల్లందాకా, పొద్దుందాకా ఇండ్లళ్ల పనిజేత్తం. రోడ్లు మంచిగ చేయాలె సారూ. వినయ్‌భాస్కర్ : ఇంకా.. ఏం సమస్యలున్నాయమ్మా? విజయ, లక్ష్మి : నీళ్లకు మస్తు గోసయితాంది. 20 ఏండ్ల కింద బోరేసిండ్రు. ఆరేండ్ల నుంచి నీళ్లత్తలేవు. అందరం పనికిబోయేటోళ్లం. పగటిపూట ట్యాంకర్లు వస్తే ఇబ్బంది అయితాంది. గౌసియాబీ : ఇక్కడ ఉండబట్టి 15 ఏండ్లయ్యింది. మా ఆయన పోలీస్‌ల జేసేది. కాళ్లు,చేతులు పడిపోయి చని పోయిండు. ముగ్గురు పిల్లలు. ఇక్కడ ఏం బాగా లేదు. వినయ్‌భాస్కర్ : ఇప్పుడు నీళ్ల సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు పెంచుతం. ఎప్పుడు రావాలె. లక్ష్మీ : పొద్దున 8 గంటల లోపు వస్తే సరిపోతది. నాలుగు ట్యాంకర్లు అయితే సరిపోతయి సారూ.. ఎల్లయ్య : ఇప్పుడు ఇండ్లళ్లకు నీళ్లు వస్తానయ్. వర్షాకాలంలో వరదలు బాగా వస్తాయ్. అప్పుడు ఖాళీ జాగా ఉంటే గుడిసెలు వేసుకున్నం. వినయ్‌భాస్కర్ : చెరువు శిఖంల వేసుకోవద్దని కోర్టు తీర్పు ఉన్నది కదా? ఎల్లయ్య : అప్పుడు పని కోసం వచ్చినం. ఇప్పుడిట్ల ఉంది. వినయ్‌భాస్కర్ : నా పేరు ఏందమ్మా ? పెద్దమ్మ : నాకు తెల్వదు బిడ్డా.. అందరు ఎట్లున్నరో ఆ రోజు నీకు చెబితి కదా.. స్వర్ణలత : అప్పుడు బీజేపోళ్లు చెప్పిన్రు. పట్టాలు లేటుగ వస్తయని అన్నరు. ఇప్పుడు మీరే చెయ్యాలె అన్న. ఇంటి నంబర్లు ఇస్తలేరు. వినయ్‌భాస్కర్ : మీ ఆయన పేరేంటమ్మా.. ఏంజేస్తరు? స్వప్న : శ్రీనివాస్ సారూ.. ఆటో తోల్తడు. వినయ్‌భాస్కర్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఆటోలకు మన సీఎం కేసీఆర్ రవాణా పన్ను తీసేసిండు. మీరు కడతలేరు కదా? శ్రీనివాస్ : కడ్తలేమన్నా. వినయ్‌భాస్కర్ : ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నరుు. ఈ కాలనీల ఎట్లున్నరమ్మా, సమస్యలున్నయా? స్పప్న : అన్నీ సమస్యలే సారూ.. ఇళ్లు లేవు. రోడ్లు లేవు. నీళ్లు లేవు. సర్కారు దయ సూడాలె. బిక్షపతి : కాలనీ ఏర్పడి 24 ఏండ్లయింది. ముప్పయి ఏండ్ల కింద చెరువు శిఖం.. ఇప్పుడు పరిస్థితి మారింది. సరైన గవర్నమెంట్ లేకనే అట్లయిందని అనుకుంటున్నం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మాకు సాయం చెయాలె. వినయ్‌భాస్కర్ : నా నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు వచ్చాను. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి స్వయంగా పేదల సమస్యల తెలుసుకోవడం ఆనందంగా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి నా శాయశక్తులా కృషిచేస్తా. థాంక్యూ.. -
బాబు ఇంటి ముందు ధర్నా చేయండి: వినయ్ భాస్కర్
చర్చించే దమ్ములేకే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వాస్తవాలు బయటపడతాయనే ఆందోళనతో టీడీపీ సభ్యులు సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్ర్కిప్టును సభలో చదువుతామంటే కుదరదని అన్నారు. ధర్నా చేయాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు...చంద్రబాబు ఇంటిముందు చేసుకోవచ్చని వినయ్ భాస్కర్ సూచించారు. -
ప్రజల ఎజెండానే.. మా ఎజెండా
వరంగల్, న్యూస్‌లైన్ : ప్రజల ఎజెండానే పార్టీ ఎజెండాగా ఉ ద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాలులో శుక్రవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడవసారి తనను ఎమ్మెల్యే గా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, సహకరించిన ప్రజాసంఘాలు, తెలంగాణవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం కారణంగా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయామని, ఈసారి అభివృద్ధి సంక్షేమానికి పునరంకితమవుతామని చెప్పారు. తెలంగాణవాదానికి పట్టం కట్టిన వారందరికీ రుణపడి ఉంటామని, కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుతానని పేర్కొన్నా రు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధిం చిన భూసమస్యను ఎంపీ కడియం సహకారం తో పరిష్కరించి పూర్తి చేస్తామన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు, రెఫరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో వినియోగించే విధంగా, జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ అభివృద్ధి, ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజల స మస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాన ని, గతంలో చేపట్టిన స్లమ్ దర్శన్, అపార్ట్మెం ట్ దర్శన్, అడ్డా ములాఖత్‌లను శని, ఆది, సో మవారాల్లో కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులు, కాలనీలు, అపార్ట్మెంట్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమివ్వన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రి పదవి లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ అర్బన్ ప్రచార కార్యదర్శి కోరబోయిన సాంబయ్య, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ సెక్రటరీ జ నరల్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు అబూబకర్, శివశంకర్, సారంగపాణి, బూర విద్యాసాగర్, అశోక్‌రావు, బోడ డిన్నా, చాగంటి ర మేష్, దశరథరామారావు, పుప్పాల ప్రభాకర్, గుజ్జారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
సారయ్యపై కొండా సురేఖ విజయం
వరంగల్ : వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ గెలుపొందారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్యపై 40వేల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. మరోవైపు వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ గెలుపొందారు. వర్థన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ విజయం సాధించారు. ఇక టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు.