
అత్త కాళ్లు నరికిన కోడలు
కూతురి పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆగ్రహం
చౌటుప్పల్: ఓ కోడలు తన అత్త రెండు కాళ్లు నరికింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని బంగారిగడ్డ కాలనీలో నివసించే ముచ్చెర్ల రాములు, మంగమ్మ (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె సుజాతకు వికలత్వం ఉంది. ఇటీవల తన పేరిట చౌటుప్పల్‌లో ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని కుమార్తె సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేసింది.
ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కోడలు జయశ్రీ.. నిత్యం అత్తతో గొడవపడేది. ఈ క్రమంలో ఆదివారం సైతం వివాదం నెలకొంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆవేశంతో కోడలు జయశ్రీ అత్తను రోకలిబండతో కొట్టి ఇంట్లో ఉన్న గడ్డపారను తీసుకువచ్చి రెండు కాళ్లను నరికింది. మంగమ్మ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.