నేటితో ప్రచారానికి తెర! | To Day Is The Final Day For Election Campaign | Sakshi
Sakshi News home page

నేటితో ప్రచారానికి తెర!

Published Tue, Apr 9 2019 3:50 AM | Last Updated on Tue, Apr 9 2019 4:14 AM

To Day Is The Final Day For Election Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రానికి మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా, అందులో 16 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5కి ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో.. అక్కడ మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,97,08,599 పాలుపంచుకోనున్నారని, అందులో 11,320 సర్వీస్‌ ఓటర్లు, 1,731 మంది ఓవర్సీస్‌ ఓటర్లు ఉన్నారన్నారు.

ఆ ప్రాంతాల్లో 4 గంటలకే ప్రచారం బంద్‌
రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో పోలిం గ్‌ వేళలను తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ములు గు, పినపాక, ఎల్లెందు, భద్రాచలం, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ ప్రాంతాల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల పరిధిలోని లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 4తో ముగియనుందని తెలిపారు.

ఓటరు స్లిప్పుతోనే ఓటేయలేరు
ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పును గుర్తింపు కార్డుగా పరిగణించమని రజత్‌కుమార్‌ తెలిపారు. ఓటరు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు లేదా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతిస్తామన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో అన్ని పోలింగ్‌ కేంద్రాలతో పాటు రాష్ట్రం లోని 6,445 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్‌ స్థానంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించనున్న ఎం–3 మోడల్‌ ఈవీఎంలకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34,604 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులోని 4,169 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని రజత్‌కుమార్‌ వెల్లడించారు. మిగతా పోలింగ్‌ కేంద్రాల్లో డిజిటల్‌ కెమెరా, వీడియో రికార్డింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ తమ ఓటు హక్కు కలిగిన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే పనిచేస్తున్నారని, అందులో 80% మందికి ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ ద్వారా పనిచేసే చోటే ఈవీఎంతో ఓటేసే అవకాశం కల్పిస్తున్నామన్నా రు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబం ధించి ఇప్పటి వరకు 460 కేసులు, పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి 579 కేసులు బుక్‌ చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి ప్రగతి నివేదికను విడుదల చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపించామన్నారు.

కమలనాథుల్లోనూ ఉత్సాహం
జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ తో పాటు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా ఎన్నికల ప్రచారానికి రావడంతో కమలనాథులు ఒకింత ఉత్సాహంగానే ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, ఎల్బీ స్టేడియం సభల్లో మోదీ.. టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. వీరిద్దరితో పాటు కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌ సింగ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, షానవాజ్‌ హుస్సేన్, హర్దీప్‌సింగ్‌ పురి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి ప్రముఖులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరిరోజు కూడా అమిత్‌షా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రచారానికి వస్తున్నారు. ముఖ్యంగా తాము ప్రభావం చూపగలిగిన స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన బీజే పీ నేతలు ఆయా స్థానాల్లోనే పార్టీ అగ్రనేతల చేత ప్రచా రం చేయించారు. లోక్‌సభ బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా సందడిగానే సాగింది.

రాహుల్‌ గాంధీ ఒక్కసారే!
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ చప్పగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినా చివరికొచ్చేసరికి ఊపందు కుంది. ఆ పార్టీ పక్షాన ముఖ్య నేతలంతా దాదాపు పోటీలో ఉండడంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచార సందడి జోరుమీద కనిపించింది. ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డి, రేణుకలతో పాటు మిగిలిన అభ్యర్థులు గత 15 రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలు, బహిరంగసభలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఈసారి ఒక్కటే రోజు ప్రచారంలో పాల్గొన్నారు. జహీరాబాద్, నాగర్‌కర్నూ ల్, నల్లగొండ పార్లమెంటు స్థానాల పరిధిలో ఒకే రోజు ఆయన మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నా రు. సోనియా కూడా వస్తారని, రాహుల్‌ మరోసారి వస్తారని భావించినా సాధ్యం కాలేదు. పార్టీ ముఖ్య నేతలు గులాంనబీ ఆజాద్, రాజస్తాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తదితరులు ప్రచారానికి వచ్చారు. మొత్తంమీద ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒకింత ఆశలతోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. సీపీఐ, సీపీఎంల పక్షాన కూడా ఆయా పార్టీల అగ్రనేతలు ఈసారి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.

డబ్బు పంపిణీపై జాగ్రత్త
ఓటింగ్‌ గదిలో ఓటే స్తూ సెల్ఫీలు తీసుకుంటే కేసులు తప్పవని రజత్‌కుమార్‌ హెచ్చరించారు. రహస్య ఓటింగ్‌ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, దీనికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కుల, మతాల ప్రాతిపదికన సమావేశాలు పెట్టి ఓట్లు అభ్యర్థించడం నేరమన్నారు. ఇలా ఎన్నికల్లో గెలిచినా, న్యాయ స్థానంలో ఎలక్షన్‌ పిటిషన్‌ పడితే పదవిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేసినా ఇలానే ఎలక్షన్‌ పిటిషన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

టీఆర్‌ఎస్‌ దూకుడు..
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ జోరుగా దూసుకెళ్లింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఏకంగా 14 లోక్‌సభ స్థానాల పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని క్షేత్రస్థాయి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంచేశారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అంటూ థర్డ్‌ఫ్రంట్‌ పోషించాల్సిన కీలకపాత్ర ఆవశ్యకత గురించి ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఓవైపు సభల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పార్టీ నేతలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారాయన. కేసీఆర్‌కు తోడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్గొన్నా రు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోడ్‌షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దీంతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా కొన్ని చోట్ల ఆయన బహిరంగసభల్లో పాల్గొన్నారు. మొత్తం మీద కేసీఆర్, కేటీఆర్‌లే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement