రుణ మాఫీ.. రూ. 1,762 కోట్లు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రుణ మాఫీ’.. ఇటీవల జిల్లాలో నాలుగున్నర లక్షల మంది రైతులను గందరగోళానికి గురిచేసి గుండెపోటు తెప్పిస్తున్న పదం. ఈ రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాలపరిమితితో సంబంధం లేకుండా రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో అన్నదాతల్లో కాసింత ఊరట నెలకొంది. దీంతో జిల్లాలో రూ.1,762 కోట్లు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. 2,76,678 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
కాగా బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ ఉండబోదని మంత్రి స్పష్టం చేయడం గమనార్హం.
తొలి ఐచ్ఛికం: ప్రభుత్వం షరతుల్లేకుండా అన్నీ రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తే జిల్లాలో 4,58,637 మంది రైతులకు సంబంధించిన మొత్తం రూ.3321.95 కోట్ల రుణాలు రద్దు కానున్నాయి.
రెండో ఐచ్ఛికం: గతేడాది ఖరీఫ్ నుంచి తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం కాలపరిమితితో కూడిన షరతు విధిస్తే.. జిల్లాలో 2,67,046 మంది రైతులకు సంబంధించిన రూ.1773.48 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంటుంది. గతేడాది ఖరీఫ్ నుంచి 2014 రబీ మధ్య కాలంలో జారీ చేసిన రుణాలు మాత్రమే రద్దు అవుతాయి. వీటిలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలతో పాటు ఇతర రుణాలున్నాయి.
మూడో ఐచ్ఛికం: రుణ స్వీకరణపై కాల పరిమితి లేకుండా రూ.లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో జిల్లాలో 2,76,678 మంది రైతులకు సంబంధించిన రూ.1762.09 కోట్ల రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంది.
నాలుగో ఐచ్ఛికం: గతేడాది ఖరీఫ్ నుంచి 2014 రబీ మధ్య కాలంలో జారీ చేసిన రూ.లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే జిల్లాలో 1,09,878 మంది రైతులకు సంబంధించిన రూ.738.62 కోట్ల రుణాలు మాఫీ కావచ్చు.
రెండేళ్లుగా నిలిచిన చెల్లింపులు
పంట రుణాలను ఏడాదిలోగా తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధి దాటితే ఆ రుణాలను బ్యాంకర్లు మొండి బకాయి(ఓవర్ డ్యూ)ల కింద జమ చేస్తారు. ఆ తర్వాత 3 నెలలు గడిచినా ఈ మొండి బకాయిలను చెల్లించకపోతే ఈ రుణాలను నిరర్దక ఆస్తులుగా పరిగణిస్తారు.
రాష్ట్రంలో రుణ మాఫీ హామీ చక్కర్లు కొడుతుండటంతో రెండేళ్లుగా రైతులు బకాయిలను చెల్లించడం నిలిపివేశారు. జిల్లాలో 1,32,813 మంది రైతులు బకాయిలు చెల్లించడం పూర్తిగా మానేయడంతో గత మార్చి 31 తేదీ నాటికి మొండి బకాయిలు రూ.906.3 కోట్లకు ఎగబాకాయి. ఇదే సమయంలో మరో 39,635 మంది రైతులు దీర్ఘకాలికంగా బకాయిలు చెల్లించకపోవడంతో రూ.180.83 కోట్ల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి.