సంగారెడ్డి క్రైం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు.. కేంద్రానికి రెండు కళ్లు లాంటివని, రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర ప్రసార, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్ అన్నారు. గతంలో అటల్ బీహారీ వాజ్‌పాయ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. సంగారెడ్డిలోని గంజ్‌మైదాన్‌లో గురువారం జరిగిన బీజేపీ-టీడీపీ ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక ధనం, జన బలానికి మధ్య జరుగుతున్నాయని, జన బలం ఉన్న బీజేపీకే ప్రజలు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి జన్‌ధన్ ద్వారా బ్యాంకు ఖాతాలు అందజేస్తున్నారని చెప్పారు. ఈ ఖాతా ద్వారా అనేక సౌకర్యాలు పొందే వీలుందన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే జగ్గారెడ్డిని ఎంపిగా గెలిపిస్తే మరిన్ని నిధులు కేంద్రం నుంచి రావడానికి అవకాశం ఉందన్నారు. కాగా ప్రకాష్ జవదేకర్ హిందీలో ప్రసంగించగా బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ తెలుగులో అనువదించారు.
జిల్లాలో రైల్వేలైన్ల మంజూరుకు కృషి: కేంద్ర మంత్రి సదానందగౌడ
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ పనులన్నీ మంజూరు చేయడానికి కృషి చేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల అవినీతిని నరేంద్ర మోడీ కేవలం వంద రోజుల పాలనలో కడిగి పారేశారని అన్నారు. కాంగ్రెస్‌పాలనంతా అవినీతిమయంగా, లోపభూయిష్టంగా కొనసాగిందని విమర్శించారు. అన్ని దేశాలు మోడీవైపే చూస్తున్నాయని పేర్కొన్నారు.
జగ్గారెడ్డిని ఎంపీగా పార్లమెంట్‌కు పంపితే జిల్లాలో మిగిలిపోయిన రైల్వే లైన్ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సదానందగౌడ ఆంగ్లంలో ప్రసంగించగా ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తెలుగులో అనువదించారు. బీజేపీ రాష్ర్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల బంగారు తెలంగాణ కోసం ఏ విధంగా అడుగులు వేశారో ప్రకటించాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రజల కాళ్లకు ముళ్లు దిగితే నోటితో తీస్తానన్న కేసిఆర్ రైతుల ఆత్మహత్యలపై, మాసాయిపేట ప్రమాదంలో చిన్నారులు మృతి చెందిన ఘటనలో కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ది చేతగాని, అసమర్థ పాలనగా అభివర్ణించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను ఖాసిం చంద్రశేఖర్ రిజ్విగా ఉదహరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ తెస్తానని హామీ ఇచ్చారు. కేసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.
టీడీపీ శాసన సభా పక్ష నేత రేవంత్‌రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో బీజేపీ, టీడీపీ నాయకులు ఆచారి, సత్యనారాయణ, బుచ్చిరెడ్డి, కె.జగన్, విష్ణువర్దన్‌రెడ్డి, విష్ణువర్దన్, తీగల కృష్ణారెడ్డి, శశికళా యాదవ్‌రెడ్డి, మాణిక్యం, బీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టండి
Published Thu, Sep 11 2014 11:47 PM | Last Updated on Thu, Aug 16 2018 3:52 PM
Advertisement
Advertisement