లబ్ధిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ సి. పార్థసారథి గురువారం విడుదల చేశారు. గతంలో లబ్ధిదారుల తుది ఎంపిక ఇన్‌చార్జి చేతుల్లో ఉండగా దాన్ని మార్పు చేసి ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్లకే కట్టబెట్టారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలతోపాటు ఐకేపీ గ్రూపుల్లో సభ్యులైన మహిళలకు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎలాంటి కనెక్షన్‌లు లేనివారికే కొత్త కనెక్షన్‌లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఐకేపీ పీడీలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎల్పీజీ జిల్లా కోఆర్డినేటర్‌లు సభ్యులుగా, డీఎస్‌వో కన్వీనర్‌గా ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని వెల్లడించారు.