మత్స్యకారులను ఆదుకుంటాం
నిజాంసాగర్: ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల మత్స్య పరిశ్రమ, హార్టికల్చర్ శాఖలు కనుమరుగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రాంత పెత్తందార్ల వల్ల ఆ రెండు శాఖలు కళావిహీనంగా మారాయని ఆరోపించారు. మత్య్సశాఖతో పాటు హార్టికల్చర్ శాఖలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సోమవారం మండ లంలోని అచ్చంపేట మత్య్సబీజక్షేత్రాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు సందర్శిం చారు.
చేప పిల్లల విత్తనోత్పతి లేక బోసిపోయిన నర్సరీలను చూసి మత్య్సశాఖ పని తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కార్మికుల సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆంధ్రా వ్యాపారులు రోయ్యల పెంపకం చేపట్టడంతో చేప పిల్లలు ఉత్పత్తి తగ్గింద న్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి 1,680 కుటుంబాలు జీవ నం సాగిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులో చేపపిల్లల పెంపకానికి తగిన ప్రాధాన్యత కల్పించి మత్స్యకార్మిక కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఏడాదికి 30 వేల కోట్ల వ్యాపారం
మత్య్సపరిశ్రమను ప్రభుత్వం వ్యవసాయానికి అనుసంధానం చేసిందన్నారు. హైదరాబాద్‌లో 20 శాతం చేపల వ్యాపారం తెలంగాణ, 80 శాతం ఆంధ్రా వ్యాపారం సాగుతోందన్నారు. దీంతో ఏడాదికి * 30 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. మత్స్యపరిశ్రమను పురోగతి దిశగా తీసుకు వెళ్లేందుకు కోసం ఆగస్టు 2న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
హార్టికల్చర్ శాఖపై ఆగస్టు ఒకటిన హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి రైతు లకు హార్టికల్చర్ సామాగ్రిని సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 25 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అసరం ఉండగా, ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినయ్‌కుమార్, శ్రీహరి, ఎన్‌డీసీసీ బ్యాంకు డెరైక్టర్ నామాల శంకర్, మత్య్సశాఖ అధికారులు రాములు పాల్గొన్నారు.