విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా శనివారం చేవెళ్ల మండలంలోని చనువల్లి అనుబంధ గ్రామం ఇక్కారెడ్డిగూడలోని పాలీహౌస్ (గ్రీన్‌హౌస్)లను సందర్శించారు.
ఆయనకు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఆర్థికంగా ఆదాయం చేకూర్చే పంటలను పండించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
మేనిఫెస్టోలో హామీలు నెరవేరుస్తాం
రుణమాఫీపై రైతుల ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ఉంటుందని తెలిపా రు. బ్యాంక్ అధికారులకు రైతుల వివరాలను ఇవ్వమని ప్రభుత్వం అడిగిందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 44వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నెల 13 నుంచి జిల్లాలవారీగా టార్గెట్‌లను ఇచ్చి పూర్తి చేయిస్తామన్నారు. గ్రీన్‌హౌస్‌లు రంగారెడ్డి జిల్లాలోనే 2013-14 సంవత్సరంలో 916మంది రైతులు 256 గ్రామాలలో వేసుకున్నారని వీటికి రూ.10కోట్ల 14లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకు సంబందించి పూర్తి వివరాలలతో కూడిన ఓ బుక్‌లెట్‌ను తయారుచేసి అన్ని గ్రామపంచాయతీలకు అందిస్తామని పోచారం పేర్కొన్నారు.
రైతులే విత్తనాలు తయారు చేసుకునేలా..
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అవసరమైన విత్తనాలను వారే తయారు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలా కాకుండా ఎక్కడైతే ఏయే పంటలు పండిస్తారో అక్కడే ఆయా విత్తనాలు తయారు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో మనకు అవ సరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రీన్‌హౌస్ రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రీన్‌హౌస్‌లకు ఇచ్చే విద్యుత్‌ను కమర్షియల్ నుంచి తొలగించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, రీప్లాంటేషన్‌కు సహయం చేయాలని కోరారు. చేవెళ్ల ప్రాతంలో కూరగాయల రైతులకు ఎక్కువగా ఉన్నారని.. వారికి కోల్డ్ స్టోరేజి అవసరమని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మైక్రో ఇరిగేషన్ ఈడీ వెంకరాంరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు బాబు, ఉమాదేవి, సంజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు మానిక్యరెడ్డి, వసంతం,నర్సింలు, రైతులు పాల్గొన్నారు.
రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తాం
విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన వనరులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం లేకపోవడం రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోనే మనకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడి వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసుకొని రైతులకు 24 గంటల కరెంటు అందించేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ప్రసుత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు 8 గంటల కరెంటు అందిస్తామన్నారు.