కేసీఆర్ మాట తప్పని సీఎం:మంత్రి మహేందర్‌రెడ్డి
వికారాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటిని అమలు చేస్తామని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట తప్పరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందుకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సంబురాల్లో భాగంగా ఆదివారం జిల్లా ముగింపు ఉత్సవాలను వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌం డ్స్‌లో నిర్వహించారు.
మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్ల ఉద్య మం, అమరుల త్యాగం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ సాధనకు కృషి చేసినట్లుగానే బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్దామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ ముందు మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ హామీ తప్పకుండా నెరవేరుతుందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి లోటు లేకుండా విత్తనాలు, ఎరువులను సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ను కోరారు.
పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, త్వరలో సర్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జేసీలు చంపాలాల్, ఎంవీ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్‌వీఎం పీడీ కిషన్‌రావు, జడ్‌పీ సీఈవో చక్రధరరావు, జిల్లా సీడీపీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ అనంతం, చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి.హఫీజ్, జిల్లా జేఏసీ, ఉద్యోగ జేఏసీ నాయకులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.