సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూ పరిహారం విషయంలో జరుగుతున్న జాప్యం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. సేకరణకు సమ్మతించిన భూ ములపై ప్రభుత్వం అవార్డు ప్రకటించి ఎనిమిది నెలలైనా పరిహారం ఇవ్వకపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసనలకు దిగుతున్నారు. ప్రత్యామ్నాయ భూములు కొనేలా సత్వరమే పరిహారం ఇప్పించా లంటూ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ ఒత్తిడి పెంచుతుండటంతో నీటిపారుదల శాఖ నిధుల విడుదలకోసం ప్రభుత్వానికి మొరపెట్టుకుంటోంది.
961 ఎకరాలు..8 నెలలు..
పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరా లకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద రిజర్వాయర్‌లు, పంప్‌హౌస్‌లు నిర్మించేందుకు 12,082 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే 10,980 ఎకరాల భూమిని సేకరించేలా వివిధ రకాల ప్రక్రియలను పూర్తి చేశారు. ఇందులో 10,019 ఎకరాలకు పరిహారం చెల్లించగా, 961 ఎకరాలను తీసుకోవడానికి ప్రభుత్వం అవార్డు చేసింది. ఈ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి వాటిని పూర్తిగా స్వాధీనపరచుకొని నిర్మాణ పనులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ 961 ఎకరాల భూమిని ఈ ఏడాది మే నెలలో అవార్డు చేసినా వీటికి సంబంధించిన రూ.62 కోట్లు పరిహారం మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు ప్రాజెక్టు పనులు జరుగనీయకుండా అడ్డుకుంటున్నారు. రైతుల డిమాండ్‌పై ఏదో ఒకటి తేల్చితే కానీ పనులు ముందుకుసాగే అవకాశం లేకపోవడంతో నీటిపారుదల శాఖ దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది.
అందని పరిహారం.. ఆగని ఆందోళన
Published Wed, Dec 18 2019 3:32 AM | Last Updated on Wed, Dec 18 2019 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment