ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ
2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి
పాలమూరు–రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులు 18 నెలల్లో పూర్తి చేయాలి
పాలమూరు సహా అన్ని ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వండి
అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులు పూర్తి చేయాలి
వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
ప్రతి పంచాయతీలో ప్రభుత్వ బడి ఉండాలి
సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఫేస్ రికగ్నీషన్ యాప్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ముఖ్యమంత్రి సమీక్ష
రూ.396.06 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహిళా సంఘాలకు రూ.334.02 కోట్ల రుణాల చెక్కు అందజేత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మినహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ఆయకట్టుపై నివేదిక సమరి్పంచాలని కోరారు. అన్ని ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ (స్థాయీ నివేదిక) సమరి్పంచాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, విద్య, వైద్య సదుపాయాలపై జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు రెండో ప్రాధాన్యత కింద చెల్లించాలి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పనులపై దృష్టి సారించాలి. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నెల 14 లేదా 15న సాగునీటి శాఖ మంత్రితో సమీక్షించి.. అదే రోజు ఆమోదం తీసుకోవాలి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించి కార్యాచరణ రూపొందించాలి..’అని సీఎం సూచించారు.
నెట్టెంపాడు రీ ఎగ్జామిన్ చేయాలి
‘జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టు మొత్తాన్ని మరోసారి పునఃపరిశీలన జరపాలి. సాంకేతిక అంశాలతో పాటు ఇతర సమస్యలను గుర్తించాలి. ప్రాజెక్టు పూర్తికి ఎంత సమయం పడుతుంది? ఎంత మొత్తం నిధులు కావాలో అధికారులు నివేదిక సమరి్పంచాలి. ఇరిగేషన్ శాఖ మంత్రితో చర్చించి తుది ప్రతిపాదనలు తయారు చేయాలి. ఆర్డీఎస్‌కు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో చర్చించాల్సిన విషయాలు, పరిష్కరించాల్సిన అంశాలను రూపొందించాలి. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి ప్రతిపాదనలు తయారు చేయాలి. ఆర్డీఎస్‌పై కొత్త ప్రతిపాదన లేమిటో తగిన ఆలోచన చేసి సమర్పించాలి..’అని రేవంత్ చెప్పారు.
మహబూబ్‌నగర్ నుంచే పైలట్ ప్రాజెక్టు
‘జిల్లా కేంద్రంలో ఆస్పత్రులు, కళాశాలలు ఒకే చోట ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయం ఆలోచించాలి. మహబూబ్‌నగర్ వంటి అత్యంత వెనుకబడిన జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలోని సమస్యలను అధిగమించేందుకు అధ్యయనం చేయాలి. సమస్యల పరిష్కారాన్ని మహబూబ్‌నగర్ నుంచే పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి.
పాఠశాలలు తనిఖీ చేయాలి
అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా ప్రభుత్వ బడి, ప్రతి మండలంలో జూనియర్ కళాశాల, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలి. ఒకవేళ లేకుంటే ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పరిశీలించాలి. ప్రతి పార్లమెంట్ యూనిట్ ఆధారంగా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలు, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల వివరాలు సమర్పించాలి. డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ ప్రతిరోజూ పాఠశాలలను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు నివేదించాలి. కలెక్టర్లు వారంలో ఒకరోజు పాఠశాలలు, ఆస్పత్రులను తప్పకుండా తనిఖీ చేయాలి. ఎవరైతే విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారో వారిపై చర్యలు తీసుకోవాలి..’అని రేవంత్ చెప్పారు.
ఆకస్మిక తనిఖీలు..అవసరమైతే చర్యలు
‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి రోజున జీతాలు ఇస్తున్నాం. విద్యా శాఖలో అందరికీ ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాం. ఉద్యోగులు, టీచర్లు వారి బాధ్యతను వారు నెరవేర్చాలి. ఇకపై నేను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. అవసరమైతే పై అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. సెక్రటేరియట్ నుంచి గ్రామపంచాయతీ వరకు హాజరు విషయంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ పెడతాం. సెక్రటేరియట్‌లో కూడా హాజరు పరిశీలిస్తాం..’అని సీఎం తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల కింద ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై ప్రతిపాదనలతో వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా మాట్లాడారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్ రూ.396.06 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రూ.334.02 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కు అందజేశారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టర్ విజయేందిర బోయి తదితరులు పాల్గొన్నారు.
నెలకోసారి సమీక్ష
‘అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణతో పాటు ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలి. ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలి. ప్రస్తుతం చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. ప్రతి ప్రాజెక్టుపై 30 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుంది. అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment