క్వారంటైన్ స్టాంపింగ్ వేస్తున్న రైల్వే సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ఏర్పాటుచేసిన వీక్లీ స్పెషల్ ట్రైన్ (02438) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నగరానికి చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం రైల్వేశాఖ నడుపుతున్న 15 ప్రత్యేక రైళ్లలో భాగంగా ఢిల్లీ–సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఇది. ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరి సోమవారం నగరానికి చేరుకుంటుంది. తిరిగి ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఢిల్లీకి చేరుకుంటుంది.
ఆ రకంగా సోమవారం మొట్టమొదటి వీక్లీ స్పెషల్ 528 మంది ప్రయాణికులతో చేరుకుంది. ఫస్ట్ ఏసీలో 20 మంది, సెకండ్ ఏసీలో 141 మంది, థర్డ్ ఏసీలో 407 మంది ప్రయాణికులు వచ్చారు. సికింద్రాబాద్ చేరుకున్న ఈ ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిబంధనల మేరకు థర్మల్ పరీక్షలు చేశారు. అలాగే ప్రతి ప్రయాణికుడి వివరాలను, ఫోన్ నెంబర్లను నమోదు చేసుకున్నారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది, రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణికులు హోం క్వారంటైన్‌కు చేరుకొనే వరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ నెల 20న ఢిల్లీకి స్పెషల్ ట్రైన్...
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (02437) ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. ఇప్పటికే ఈ ట్రైన్ కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకున్నారు. సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీలో వెయిటింగ్ లిస్టు నమోదుకావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment