డెంగీ పంజా! | Dengue Fever in Mahabubnagar | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా!

Published Sat, May 16 2020 11:44 AM | Last Updated on Sat, May 16 2020 12:37 PM

Dengue Fever in Mahabubnagar - Sakshi

పాలమూరు: ఒకవైపు కరోనా వైరస్‌ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు డెంగీ జ్వరం జిల్లాను వణికిస్తోంది. తెల్లబోతున్న రక్తకణాల రూపంలో దిగాలు పరుస్తోంది. అవసరానికి అందని కణాలు.. ముందుకు రాని రక్తదాతల రూపంలో బాధితుల్లో ఆవేదన రగిలిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసులతో పాటు ఆడపాదడపా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లోపిస్తున్న పారిశుద్ధ్యమే శాపంగా అనారోగ్య పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా దిగాలు పరుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రెగ్యులర్‌గా వచ్చే కేసుల కంటే ఎక్కువగా డెంగీవి నమోదవుతుండటం గమనార్హం. ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు పెరగడంతో దోమలు విజృంభిస్తున్నాయి.  

నిర్ధారణ పరికరాలు ఎక్కడ?
సీజనల్‌ వ్యాధులను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సమీక్ష సమావేశాల్లో అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో తప్పా.. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా డెంగీ నిర్ధారణ పరికరాలు లేవు. దీంతో బాధితులు కొందరు జనరల్‌ ఆస్పత్రికి వస్తున్నా చాలా మంది హైదరాబాద్‌ వెళ్లి వేలాది రూపాయలను ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు కార్పొరేట్‌ హంగులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్లేట్‌లెట్ల కిట్లు, వాటికి సంబంధించిన యంత్రాలు ఆయా ప్రాంతీయ ఆస్పత్రుల్లో లేవు. ఈ ఏడాది జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా హన్వాడ, జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర మండలాలతోపాటు గంగాపూర్, ఎదిరలో నమోదయ్యాయి.

జనరల్‌ ఆస్పత్రిలోనే..
జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి రూ.25లక్షల విలువజేసే సింగిల్‌ డోనర్‌ ప్లేట్లెట్‌ (ఎస్‌డీపీ) మిషన్‌ను ఏర్పాటు చేశారు. డెంగీ రోగులకు రక్తంలో ఉండే ప్లేట్లెట్‌ మాత్రమే కావాల్సి ఉండగా, దాత నుంచి అవసరమైన కణాలను మాత్రమే గ్రహించి మిగిలిన వాటిని తిరిగి పంపించేస్తోంది.  

జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లా కేంద్రంతో పాటు భూత్పూర్, బాదేపల్లి మున్సిపల్‌ అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది. ఆయా వార్డుల్లో చెత్త కష్టాలు తీర్చేందుకు ప్రత్యేకంగా చొరవ చూపడంలేదు. ప్రధాన ప్రాంతాలు మినహా, ఇరుకుగా ఉన్న కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు లేదని స్థానికులు వాపోతున్నారు. అధ్వాన పరిస్థితులకు ఖాళీ స్థలాలే అందుకు కారణమని గుర్తించినా చర్యలు లేవు. ప్రతినిత్యం పట్టణంలో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నా పూర్తిస్థాయిలో వార్డుల నుంచి చెత్తకుప్పలు తొలగడం లేదు. పర్యవేక్షణ లోపం, పని చేస్తున్నామనే భ్రమ కల్పించడమే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కన్పించడం లేదు. ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి.

వాతావరణ మార్పులతో..
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. వాతావరణంలో ఎండకాలం నుంచి వేడి పూర్తిగా తగ్గడంతో వైరల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దోమలు నిల్వ ఉండటం వల్ల డెంగీ వ్యాధి సోకుతుంది. అలాగే ఇళ్ల చుట్టూ.. మధ్యలో మురుగు నిల్వ ఉంటే వాటిపై దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. నీటి కాలుష్యం ఎక్కువ. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు కాసి వడబోసిన నీళ్లే తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement