సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రజలందరికీ ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రజలందరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసి వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని భావిస్తోంది. అందు కు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను తాజాగా ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రివర్గం ఏర్పాటయ్యాక వైద్య, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో కసరత్తు చేస్తారు. కాగా, గత ఆగస్టు 15న ప్రారంభమైన ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని 6 నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం 6 నెలలు పూర్తయ్యాక ఈఎన్‌టీ, దంత పరీక్షలు ప్రారంభిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నట్లు కనీసం 2 కోట్ల మందికి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ‘కంటి వెలుగు’కార్యక్రమం మాదిరిగా ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈఎన్‌టీ, దంత స్క్రీనింగ్ చేశాక లోపాలను గుర్తించి వారికి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తారు. కంటి వెలుగు కింద 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలే ఉపయోగించుకున్నందున ఈఎన్‌టీ, దంత పరీక్షలూ ఆయా వర్గాల వారికే ఉపయోగపడతాయని అంచనా
వైద్య నిపుణుల జాబితా..
కంటి వెలుగు కింద ఇప్పటికే కోటి మందికి పరీక్షలు చేశారు. మరో కోటి మందికి చేసే అవకాశముంది. ఇప్పటికే లక్షలాది మందికి కంటి అద్దాలు ఇచ్చారు. ఈ విధంగానే రెండు కోట్ల మందికి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, ఆపరేషన్లు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఈఎన్‌టీ వైద్యులు, దంత వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు లోపాలను సరిదిద్దడం, ఆపరేషన్లు చేయడానికి వీలుగా కొన్ని ప్రైవేటు ఈఎన్‌టీ, దంత ఆసుపత్రులతోనూ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఆయా శస్త్రచికిత్సలకు అవసరమైన సొమ్ము కూడా సంబంధిత ఆసుపత్రులకు ఇస్తారు. అందుకోసం ఎంత ఖర్చు అవుతుందో తేల్చాలని సర్కారు ఆదేశించింది. ప్రజలకు ఉన్న ఇతరత్రా అనారోగ్య సమస్యలను తెలుసుకొని వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. వారి బీపీ, షుగర్ సహా ఇతరత్రా అనారోగ్య సమస్యలను రికార్డు చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు. అలా చెకప్‌లో వచ్చిన లోపాల ఆధారంగా అవసరమైన వారికి వైద్యం చేస్తారు.
లోపాలను సరిదిద్దేందుకు..!
పేదలు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ)కు సంబంధించిన సమస్యలను పెద్దగా పట్టించుకోరు. దీంతో అవి పెద్దవై సమస్యను తీవ్రంగా చేస్తాయి. పంటికి సంబంధించిన అంశాలపైనా దృష్టిపెట్టరు. చిన్నతనంలో వచ్చే మూగ, చెవిటికి సంబంధించిన లోపాలను రెండేళ్లలోపు గుర్తిస్తే పూర్తిగా నయం చేసే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన వెంటనే చెవుడును గుర్తించే పరికరాలూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చే చెవిటిని నయం చేసే వీలుంది. అలాగే 50–60 ఏళ్లలో చెవుడు వచ్చే అవకాశం ఉంది. ఆయా లోపాలను సరిదిద్ది అవసరమైన వైద్యం చేసేందుకే ప్రభుత్వం ఈఎన్‌టీ, దంత వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కంటివెలుగు విజయవంతం కావడంతో ఈఎన్‌టీ పరీక్షలను కూడా అదేస్థాయిలో చేయాలని సర్కారు భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment