గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ జన సమూహంలోకి వ్యాపించిందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా వైరస్ అనుమానితులను ఐసోలేట్ చేయడానికి, రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి వీలుగా రాష్ట్రంలో 8 ఆసుపత్రులను పూర్తిగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి ఆసుపత్రులను కరోనా చికిత్సకే పూర్తిగా వినియోగించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా వాటిని సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తాజాగా మరో 6 ఆస్పత్రులను కూడా పూర్తిగా కరోనా చికిత్సల కోసమే వాడుకోవాలని నిర్ణయించారు.
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఫీవర్ హాస్పిటల్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం, నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇక గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా పూర్తిస్థాయిలో కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నారు. ఈ ఎనిమిదింటిలో మొత్తం కలిపి 5 వేల పడకలు కరోనా రోగుల చికిత్స కోసం సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఆ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు తప్ప మిగతా సేవలన్నీ నిలిపేశారు. త్వరలోనే ఐదు ఆస్పత్రుల్లోనూ ఇతర వైద్య సేవలను నిలిపేసి కేవలం కరోనా చికిత్సలనే అందించనున్నారు. ఇక గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రిగా తీర్చిదిద్దేలా చర్యలు మొదలయ్యాయి. కరోనా కోసం ఆర్డర్ చేసిన వెంటిలేటర్లను సైతం ఈ ఎనిమిదింటిలోనే అమర్చనున్నారు. జిల్లాల్లోని ఆస్పత్రులను తొలుత ఐసోలేషన్‌కే వాడుకోవాలని, కేసుల సంఖ్య ఊహించనంతగా పెరిగితేనే అక్కడ చికిత్సలు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
ప్రైవేటు బోధనాస్పత్రుల్లో 10 వేల పడకలు...
ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో 10 వేల పడకలను కరోనా ఐసోలేషన్‌కు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో 80 శాతం వరకూ కరోనా కోసమే వాడుకొనే అవకాశముంది. ఆయా ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఉంచే కరోనా రోగులకు అక్కడి డాక్టర్లు, సిబ్బందే చికిత్స అందించనున్నారు. కానీ రోగులకు కావాల్సిన ఆహారం, మందులు, మాస్కులు, శానిటైజర్లు ఇతరత్ర వస్తువులను ప్రభుత్వమే ఆయా ప్రైవేటు బోధనాస్పత్రులకు అందించనుంది.
మూడో దశలోకి వెళ్తున్నందునే...
కరోనాపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు ఎందుకు చేస్తోందన్న దానిపై సీరియస్‌గా చర్చ జరుగుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం వల్లే సర్కారు ముందస్తు చర్యలు చేపడుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ దాటిందని, మూడో దశలోకి ప్రవేశించిందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ‘ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారంటేనే వైరస్ కిందిస్థాయికి వెళ్లినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చినవారు స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమైపోయారు. కాబట్టి వైరస్ ఎప్పుడో జన సమూహంలోకి వెళ్లిపోయింది. అది ఎప్పుడు బాంబులా పేలుతుందో తెలియదు’అని కరోనా వైరస్‌ను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఒక కమిటీలోని కీలకమైన అధికారి వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే మరింత ముప్పు తప్పదంటున్నారు.
వైద్య సిబ్బందికి మాస్కులేవీ?
గాంధీ ఆస్పత్రి సహా పలు ఇతర ఆస్పత్రుల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి మాస్కులు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్95 మాస్కులు, శానిటైజర్లను తెప్పించినా అవి కొందరు వీఐపీల కోసమే వెళ్తున్నాయని వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. ‘బాక్సులకొద్దీ మాస్కులు, శానిటైజర్లు మా కార్యాలయానికి తెప్పించాం. అయినా అనేక మంది నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఎన్ని తెచ్చినా సరిపోవడంలేదు’అని సంబంధిత కీలక ప్రజాప్రతినిధి అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక అంచనా ప్రకారం వేలాది మాస్కులు, శానిటైజర్లు మాయమైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అవి ఎక్కడికి వెళ్లాయన్న దానిపై అంతర్గత స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. దీంతో మాస్కుల కొరత ఉందని వైద్యాధికారులు అంటున్నారు. ఇటీవల జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో 2 లక్షల మాస్కులను తెప్పించేందుకు కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత అధికారి ఉన్నతస్థాయి అధికారికి వివరించారు. సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలతో కరోనాపై పోరాడుతుంటే కొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment