అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి
త్రిపురారం : వివిధ రకాల పింఛన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని జేసీ ప్రీతిమీనా సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం మండలంలోని కంపాసాగర్ గ్రామంలో ఇంటింటా అధికారులు నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. సర్వే తీరును అధికారులను అడిగితెలుసుకున్నారు. గ్రామంలో సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంత మంది అర్హత పొందారు, అనర్హత పొందిన వారు ఎందరున్నారని సర్వే బృందాలను ప్రశ్నించారు. పింఛన్లల్లో అర్హత పొందిన సింగారపు సోమమ్మ ఇంటికి జేసీ వెళ్లి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. తనకు ఉండటానికి ఇల్లు కూడా లేదని , పింఛన్ ఇప్పించి న్యాయం చేయాలని సోమమ్మ జేసీ కాళ్లపై పడి మొరపెటుకుంది.
పింఛన్లలో అర్హత కోల్పోయిన మామిడాల చెన్నమ్మ, పొదిల వెంకులు, గౌరు కృష్ణమూర్తిల ఇళ్లను పరిశీలించి అర్హత ఎందుకు కోల్పాయారని ప్రశ్నించారు. వారికి ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి, మోటర్ బైక్‌లు, ఉన్నట్లు గుర్తించామని సర్వే బృందాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్న వారినే ప్రభుత్వ పథకాల కోసం ఎంపిక చేయడానికి పకడ్బందీగా సమాచారం సేకరించాలని సర్వే బృందాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిషన్‌రావు, తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఈఓఆర్డీ దండా జితేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయశ్రీ, సర్పంచ్ కొప్పు ధనలక్ష్మి, వీఆర్‌ఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.