ఆవేశమే మృత్యువై...
నాగోలు: కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు చిన్న విషయాలకు గొడవ పడ్డారు. ఈ ఘర్షణ తరువాత భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.... తన అక్కను బావే హత్య చేశాడని భావించిన బావమరిది కత్తితో అతని గొంతు కోసి కడతేర్చాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారి ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యూరు. ఈ సంఘటన బుధవారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓల్డ్ మలక్‌పేట సరోజినీ నగర్‌కు చెందిన బాబామియా(40)కు అదే ప్రాంతానికి చెందిన సలీమాబేగం (37)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బాబామియా మలక్‌పేట రేస్ కోర్టులో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై చీటికి మాటికి భార్యతో గొడవ పడేవాడు. సలీమాబేగం తల్లి ఫాతిమాబేగం కుటుంబం మలక్‌పేట నుంచి నాగోలు జైపురి కాలనీ బ్లైండ్ కాలనీలోకి మకాం మార్చారు.
బాబామియా తరచూ భార్యను ఇబ్బందులకు గురిచేయడంతో వారిని బ్లైండ్ కాలనీలోకి తీసుకొచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. అయినా అతను వేధింపులు మానుకోలేదు. ఈ విషయంలో మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో మలక్‌పేట సరోజినీనగర్‌లో నివాసముండే బాబామియా తన తల్లి జైరాబిబేగంకు ఫోన్ చేసి ‘మీ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది... వెంటనే ఇక్కడికి రావాలని పిలిచాడు.
ఇది విన్న బాబామియా పెద్ద కుమార్తె షబా సమీపంలో ఉంటున్న అమ్మమ్మ ఫాతిమాబేగం, మేనమామ మున్నాలకు విషయం తెలిపారు. ముందుగా ఫాతిమా వంట గదిలోకి వెళ్లి చూసేసరికి కూతురు సలీమా బేగం కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కిందికి దించేసరికే ఆమె మృతి చెందింది. వెంటనే వెనుక నుంచి వచ్చిన బావమరిది మున్నా ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో బాబామియా మెడపైన పొడిచి, పొట్ట భాగంలో కోశాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో బాబామియా అక్కడికక్కడే మృతి చెందాడు. బయటకు వచ్చిన మున్నా తన బావను చంపానని... పోలీసులకు తెలపాలని స్థానికులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ ఏసీపీ సీతారాం, సీఐ శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తన కూతురిని అల్లుడే హత్య చేశాడని తల్లి ఫాతిమాబేగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తన కొడుకును హత్య చేశారంటూ మృతుడు బాబామియా తల్లి జైరాబీబేగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సలీమాబేగం మృతి అనుమానాస్పదంగా ఉందని, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. మున్నా పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
ఒకే చోట ఖననం...
పోస్టుమార్టం అనంతరం భార్యాభర్తల మృతదేహాలను ఒకే వాహనంలో మలక్‌పేటలోని సొంత ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో ఒకే చోట ఖననం చేసినట్టు సమాచారం.
అనాథలైన పిల్లలు
తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ముగ్గురు కుమార్తెలు షబా, పర్వీన్, షబానా ఒంటరి వారయ్యారు. ఇటు అమ్మమ్మ వద్దకు వెళ్లాలో... అటు నానమ్మ వద్దకు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.