టీఆర్‌ఎస్ పార్టీతోనే తెలంగాణ.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.
పటాన్‌చెరు రూరల్: టీఆర్‌ఎస్ పార్టీతోనే తెలంగాణ.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. బుధవారం మండలంలోని ఇంద్రేశం గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు.
తెలంగాణ ప్రాంతం అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎంపీపీలు, స్థానిక సర్పంచులు, అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ, వార్డు సభ్యులు బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.