ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు.. | dhanush gets rebirth | Sakshi
Sakshi News home page

ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..

Published Sat, Jul 26 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..

ధనుష్ మళ్లీ పుట్టాడు.. దత్తు వెళ్లిపోయాడు..

ఒక తల్లికి ఆనందం.. ఇంకో తల్లికి గర్భశోకం

‘స్కూలు బస్సు’ మృతుల గుర్తింపులో పొరపాటు
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: తమ కనుపాప దూరమైందని తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి ఆశలు వదిలేసుకున్న ఆ దంపతులు.. తమ బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుని విషాదం నుంచి తేరుకున్నారు. అవును.. పుట్టినరోజు నాడే ‘ధనుష్’ మళ్లీ పుట్టాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడనుకున్న చిన్నారి ధనుష్ అలియాస్ దర్శన్ గౌడ్ బతికే ఉన్నాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భావిస్తున్న మరో పిల్లాడు దత్తు.. ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయినటుతేలింది.
 
 దీంతో ఆ కుటుంబాల్లో పరిస్థితి తారుమారైంది. ఒకరింట సంతోషం.. మరో ఇంట విషాదం నెలకొంది. పిల్లలను గుర్తించడంలో పొరపాటు వల్ల ఈ ఉదంతం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన జాలిగామ స్వామిగౌడ్-పుష్ప దంపతులు తమ కొడుకు ధనుష్‌ను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి గురువారమే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే శుక్రవారం ఉదయం వారికి వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. మీ కొడుకు ధనుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, వచ్చి చూడండంటూ కబురందించారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. ప్రమాదంలో చనిపోయిన దత్తు మృతదేహాన్ని తమ పిల్లాడిదని పొరబడి తీసుకొచ్చినట్లు వారికి అర్థమైంది. కాగా, ఇదే మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరబాబు-నీరజ దంపతుల కూతురు భువన రైలు పట్టాల మీదే చితికిపోయింది. అదే స్కూలు బస్సులో ఉన్న తమ కొడుకు దత్తు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు భావించారు. కూతురు అంత్యక్రియలు పూర్తి చేసి.. కొడుకైనా మిగిలాడనుకున్నారు. తెల్లారేసరికే ఆ దంపతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రమాదం జరిగిన రోజే మార్గ మధ్యలో దత్తు చనిపోయాడని అధికారులు గుర్తించడంతో వీరబాబు కుంటుంబం మళ్లీ శోకసంద్రమైంది.
 
 తల్లిదండ్రుల పేర్లు చెప్పిన ధనుష్
 
 ప్రమాదంలో ధనుష్(అలియాస్ దర్శన్ గౌడ్) మృతి చెందినట్లు అందరూ భావించారు. అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన (దత్తు)మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారికి తిరిగి అప్పగించారు. గురువారం రాత్రే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన 20 మంది చిన్నారులు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో తీవ్రంగా గాయపడిన ధనుష్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో స్పృహ కోల్పోయి... శుక్రవారం తెల్లవారుజామున తిరిగి స్పృహలోకి వచ్చాడు. అతన్ని ప్రశ్నించిన వైద్యులకు తన తల్లిదండ్రుల పేరు, తన నానమ్మ పేరు చెప్పడంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు సమాచారం అందించారు. బాబును గుర్తించేందుకు కుటుంబసభ్యులు హుటాహూటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి.. తన తండ్రి స్వామిగౌడ్‌ని చూసి నాన్నా.. అని పిలవడంతో తమ బిడ్డ బతికే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
 
 పాపం వీరబాబు, నీరజ దంపతులు
 
 ఇప్పటికే కూతురు భువనను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన వీరబాబు-నీరజ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. బతికే ఉన్నాడనుకుంటున్న తమ కొడుకు దత్తు కూడా చనిపోయాడని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న దత్తును సహాయక బృందం హుటాహుటిన కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దత్తు చనిపోయాడు. అయితే దత్తు, ధనుష్‌ల ఎత్తు, పొడవు, రూపం ఒకే విధంగా ఉండటం, ముక్కు, దవడ భాగం పూర్తిగా చితికిపోయి ఉండటంతో పాటు ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోవడం వల్ల తల్లిదండ్రులు తమ బిడ్డలను సరిగా గుర్తించలేకపోయారు.
 
 కూతురు చనిపోయిన బాధలో మునిగిపోయిన వీరబాబు దంపతులు తమ కొడుకు బతికే ఉన్నాడనే భ్రమలో ఉండిపోయారు. అయితే కిష్టాపూర్‌లో స్వామిగౌడ్ ఖననం చేసింది వారి కుమారుడిని కాదని తేలడంతో... వీరబాబు దంపతులకు అనుమానం వచ్చింది. అయ్యో..! చనిపోయింది తమ బిడ్డ దత్తే కావచ్చునని గుండెలు బాదుకున్నారు. అప్పటికి కొడుకు కోసం ఆసుపత్రిలో ఉన్న ఆ దంపతులు అక్కడే కుప్పకూలిపోయారు. మంత్రి హరీశ్‌రావు సహా అధికారులు వారిని ఓదార్చే యత్నం చేశారు. వారిని హరీశ్‌రావు స్వయంగా తన కారులో కిష్టాపూర్‌లో దత్తు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి తీసుకెళ్లారు. స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్యర్యంలో పోలీసులు సిబ్బంది, సిద్దిపేట ఆర్డివో ముత్యంరెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఇరు కుటుంబాల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీయించారు. వీరబాబు-నీరజ దంపతులు దత్తును గుర్తించారు. కన్నీరు మున్నీరుమున్నీరుగా విలపించారు. అధికారులు చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇస్లాంపూర్ గ్రామంలో దత్తు మృతదేహానికి మళ్లీ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలనూ కోల్పోయిన వీరబాబు దంపతులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement