
సాక్షి, హైదరాబాద్: కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా అన్నారు. వారికి సహాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
ఏఐసీసీ నేతృత్వంలోని ఓ బృందం ఇటీవల కువైట్‌లో పర్యటించిన సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అనుభవాలను ఆయన గురువారం గాంధీభవన్‌లో మీడియాతో పంచుకున్నారు. వేల సంఖ్యలో తెలంగాణకు చెందిన కార్మికులు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు కనీసం టికెట్లకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20 మందికి టికెట్లు ఇచ్చి తీసుకువచ్చామన్నారు. మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా టికెట్ ఖర్చులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆజాద్‌కు ఘన నివాళులు..
కేంద్రంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.