ఇక డిజిటల్ వ్యవసాయం
* ఇక్రిశాట్‌తో ఐటీ, వ్యవసాయశాఖల త్రైపాక్షిక ఒప్పందం
* సన్న, చిన్నకారు రైతుల కోసం గ్రీన్ ఫ్యాబ్‌లెట్ ఆవిష్కరణ
* ఉత్పాదకతను పెంచేందుకు దోహదం: కేటీఆర్
* సాంకేతిక ఫలాలు రైతులకు చేరాలి: పోచారం
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం డిజిటల్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఐటీశాఖ, ఇక్రిశాట్‌ల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్‌బెర్గ్ లెన్సన్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌లు ఎంవోయూపై సంతకాలు చేశారు.
అనంతరం గ్రీన్ ఫ్యాబ్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇక్రిశాట్‌తో వ్యవసాయ, ఐటీ శాఖల మధ్య జరిగిన ఒప్పందం రైతులకు ఎంతో మేలు చేస్తుందని... టెక్నాలజీ ద్వారా మానవ వనరుల కొరతను అధిగమించి గ్రీన్ ఫ్యాబ్‌లెట్ ద్వారా గ్రామగ్రామాన రైతుకు కావాల్సిన సమాచారం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న వ్యవసాయ పద్ధతులను రాష్ర్టంలో రైతులకు వివరించాలని, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులతోపాటు సహకార సంఘాలను భాగస్వామ్యం చేసి రైతులకు సాంకేతికత ఉపయోగపడేలా చూస్తామని వివరించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు లాభసాటి ధరలు రావడానికి... తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి త్రైపాక్షిక ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు.
అధికారులు గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని, అప్పుల్లేని తెలంగాణ రైతులుగా తీర్చిదిద్దాలని మంత్రి పోచారం సూచించారు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్‌బెర్గ్ లెన్సన్ మాట్లాడుతూ సాంకేతిక సమాచారం రెతులకు ఉపయోగమని... ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న పరిశోధన ఫలాలు వారు వాడుకుని తద్వారా తమ ఉత్పాదకతను పెంచుకోవచ్చని అన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం జరుపుకోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.