సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటు సంతోషం తెలుపుతున్నారు. అలాగే పలు కళాశాలల్లో విద్యార్థినులు .. మా ఆడపిల్లకు న్యాయం జరిగిందంటూ నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు. పోలీసులను ప్రశంసిస్తూ పూల వర్షం కురిపించారు.
మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాహో సజ్జనార్... శభాష్ సజ్జనార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేళ్ల క్రితం వరంగల్‌లో యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసిన నిందితులను పోలీసులు ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మళ్లీ పదేళ్ల తర్వాత అదే సంఘటన చటాన్‌పల్లిలోనూ పునరావృతం అయింది. దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అప్పుడు, ఇప్పుడు ఎన్‌కౌంటర్ క్రెడిట్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌దే. దీంతో సజ్జనార్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా వరంగల్ యాసిడ్ దాడి నిందితులు కూడా డిసెంబర్ నెలలోనే ఎన్‌కౌంటర్ అయ్యారు.
2008 తర్వాత మళ్లీ ఇదే...
వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష‍్టించింది. వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక మృతి చెందగా, ప్రణీత చాలాకాలానికి కోలుకోగలిగింది. యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులు అరెస్టై, మూడు రోజుల అనంతరం 2008, డిసెంబర్ 13) నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ... దిశ హత్యకేసు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలిపారు. పోలీసుల నిర‍్వహణలో భాగంగానే ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు. మరోవైపు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఎవరీ సజ్జనార్?
కర్ణాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ 1996 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. వరంగల్, మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వరంగల్‌లో 2008లో యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో ఆయన జిల్లా ఎస్పీగా ఉన్నారు. మెదక్‌లో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన గంజాయి స్మగ్లర్‌ను ఎన్ కౌంటర్ చేశారు. ఆక్టోపస్ ఐజీ గా ఉన్న సమయంలో ఐఎస్ఐ తీవ్రవాదులు వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించారు. ఇక నయీం ఎన్‌కౌంటర్‌లో కూడా సజ్జనార్ లీడ్ చేశారనే ప్రచారం పోలీస్ వర్గాల్లో ఉంది.
చదవండి:
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు
దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
Comments
Please login to add a commentAdd a comment