లబ్ధిదారులందరికీ పింఛన్లు
- జిల్లాకు 2లక్షల 5 వేలు మంజూరు
- జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్
జక్రాన్‌పల్లి :అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లను అందజేస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. జిల్లాకు రెండు లక్షల 5వేల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మండలంలోని పడకల్,మనోహరాబాద్,జక్రాన్‌పల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పింఛన్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు పింఛన్లు రావడంలేదని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు,వికలాంగులు ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దన్నారు. పింఛన్లు రావని ఎవరు అపోహలకు గురికావద్దన్నారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆసరా పింఛన్లను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆసరా పింఛన్లు,ఆహార భద్రత కార్డులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అదే సమయంలోఎలాంటి వివరాలు లేకుండా ఐకేపీ ఏపీఎం శ్యామ్ కార్యాలయానికి రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మనోహరాబాద్ శివారులో గల విమానాశ్ర యం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టుకు స్థలం అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పడకల్‌లో పరిశ్రమల స్థాపన కోసం 410 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు.
ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం..
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో, మెడికల్ ఆఫీసర్-1 సంతోష్‌కుమార్ వర్ని క్యాంపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మరో మెడికల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ సెలవులో ఉన్నారని చెప్పారు. కాగా సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి మాత్రం సెలవు లేకపోయినా, సీఎల్ వేసుకొని వెళ్లడంతో, ఎవరి అనుమతి లేకుండా సీఎల్ వేసుకోవ డం ఏంటని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో యాదిరెడ్డి,జడ్పీటీసీ సభ్యురాలు తనుజారెడ్డి,సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోర్త రాజేందర్,మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు.