జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం | District of priority projects | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Published Mon, Nov 3 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం

జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం

అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో రూ.5 వేల కోట్లతో రాష్ట్రంలో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. రైతులు చెరువులో తీసిన ఒండ్రుమట్టిని పొలాల్లో వేసుకుంటే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని సూచించారు.

తెలంగాణ లో ఖరీఫ్ పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతుంటే, కరెంట్ ఇవ్వకుండా చంద్రబాబు ఆంధ్రాలో రెండో పంట కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఉమ్మడి ఒప్పందాలను బాబు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులెదురైనా రైతులకు ఆరుగంటల విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా ఒప్పందాలకు లోబడి ఉమ్మడి పరీక్షా విధానాన్ని అంగీకరించామని తెలిపారు.

పల్లెటూర్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారభద్రత కార్డును ఇవ్వనున్నామని పేర్కొన్నారు. అనంతరం ఉప్పునుంతలలో రూ.64 లక్షల నాబార్డు నిధులతో నిర్మించనున్న పీఏసీఎస్ గోదాం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వరాలజల్లు కురిపించారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వలబాలరాజ్, ఎంపీపీ తిప్పర్తి అరుణ, జెడ్పీటీసీ కట్టా సరిత, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సదాశివరెడ్డి, పెనిమిళ్ల సర్పంచు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్ పథకాల అమలు
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం అచ్చంపేటలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాలులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా మారుస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోవడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ ప్రతి ఎకరాకు నీరు పారే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామన్నారు. టీఆర్‌ఎస్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీ గౌరవం దక్కుతుందన్నారు. టీడీపీతో వేసారిపోయి ఆ పార్టీకి చెందిన చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పోకల మనోహర్ చేరికతో పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు. భూమి లేని నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి, రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు.

అమ్రాబాద్ మండలం మానువడ్డ వాగు, బల్మూర్ మండలం రుసూల్ చెర్వు మరమ్మతులు చేయిస్తామన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత పోకల మనోహర్, అచ్చంపేట ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి,12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట పార్టీ ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి, చీమర్ల దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement