సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా సా గింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి పుణ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీ ర్ అలీ అన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు అధ్యక్షత వహించారు. సుమారు ఐదు గంటల పాటు ఎజెండాలోని అంశాలు వరుస క్రమంలో కాకుండా, ఎంపిక చేసిన 11 అంశాలపై సభ్యు లు చర్చ జరిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, నిజా మాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎ.రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
విద్య..
విద్యాశాఖ పనితీరుపై సమీక్షతో సమావేశం ప్రారంభమైంది. డీఎస్సీపై మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యులు విమర్శించారు. గాంధారి మండలంలో విద్యావలంటీర్ల నియామకం సక్రమంగా జరగలేదని సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సరిగా సాగడం లేదన్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.
విద్యుత్..
పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేళ్లాడుతుండడంతో ప్రమాదాలు పొంచి జరుగుతున్నాయని, ఇంటర్ పోల్స్ ఏమయ్యాయో అర్థం కావడం లేదని సభ్యులు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏబీ స్విచ్‌లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య స్వల్ప వాదోపవాదాలు జరిగాయి.
వ్యవసాయం..
మధ్యాహ్న భోజన విరామం అనంతరం వ్యవసాయశాఖపై సభ్యులు చర్చించారు. ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరికి ఎక్కువగా రుణం ఇస్తుండడంతో అందరూ వరి సాగు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోందని, తద్వారా పంట నష్టపోతే పరిహారం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నందిపేట ఏవోను తొలగించాలని సభ్యులు కోరారు. ఆయన పనితీరులో నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామీణాభివృద్ధి..
ఇంకుడు గుంతలు నిర్మించుకుని మూడేళ్లవుతున్నా బిల్లులు ఇవ్వలేదని సభ్యులు పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది లబ్ధిదారుల్లో 18 వేల మందికి బిల్లులు రావాల్సి ఉందని, వెంటనే ఇప్పించాలని కోరారు.
ఉపాధి హామీ నిధులు..
ఈజీఎస్‌కు జిల్లాలో ఎంపీలాడ్స్, ఏసీడీపీ నిధుల మ్యాచింగ్ గ్రాంట్ విషయమై చర్చించారు. ఎంపీపీలు తీర్మానాలు చేయకపోవడంపై అభ్యంతరం తెలపగా, ఎంపీ, ఎమ్మెల్సీలు ఈజీఎస్ నిధులతో సంబం ధం లేకుండా పూర్తిగా నిధులు ఇవ్వాలని బాజిరెడ్డి సూచించారు.
ఉద్యానవన శాఖ..
కూరగాయల విత్తన పంపిణీ నిలిచిపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. మండల సమావేశాలకు ఉద్యానవన అధికారులు హాజరుకాకపోవడంపై అభ్యంతరం తెలిపారు. అసలు ఉద్యానవన శాఖ ఉన్నట్లు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు సైతం తెలియడం లేదన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలు ఎందుకు చేయడంలేని ప్రశ్నించారు. 2015–16కు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదని సభ దృష్టికి తెచ్చారు.
నీటి పారుదల..
సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 8 టీఎంసీలు వదిలారని నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు. అవి మిగులు జలాలేనని, మిగతా 9 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉందని పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. మంచిప్ప రిజర్వాయర్‌కు రూ. 375 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు వచ్చాయని, అంచనాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్..
పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో అలసత్వం వహించిన కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. పిట్లం, భిక్కనూరు, ఆర్మూర్ తదితర మండలాల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు అంశాలపై తీర్మానాలు..
సమావేశంలో 26 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఇందులో ప్రధానంగా 417 సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ, సీడీపీ నిధులు కేటాయిస్తూ చేసిన తీర్మానాలున్నాయి. సుమారు 50 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ఉపాధి హామీ నిధులకు విద్యాశాఖ నిధులను మ్యాచింగ్ గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఐదు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ తీర్మానించారు.
మిషన్ భగీరథ...
మిషన్ భగీరథ అధికారుల తీరుపై సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి పట్టణానికి 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. మున్సిపాలిటీ నుంచి నిర్వహణ ఖర్చులు రావడం లేదని అధికారులు సమాధానమివ్వడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు. డిసెంబర్ నాటికి సింగూరు గ్రిడ్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment