టీఆర్‌ఎస్ జిల్లా కమిటీలపై మల్లగుల్లాలు!
- సీఎం కేసీఆర్ చేతిలో జిల్లా అధ్యక్షుల జాబితా
- కార్యవర్గాల కూర్పుపై మాత్రం జిల్లా నేతల తంటాలు
- పలుచోట్ల విపరీతమైన పోటీ
- రెండు రోజుల్లో కమిటీలు ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత కమిటీల నియామకం వ్యవహారం అధికార టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల కమిటీలు, ప్రతి జిల్లాలో తొమ్మిది అనుబంధ సంఘాల కమిటీలను ఒకేసారి ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కమిటీల ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం మేరకు 4, 5వ తేదీల్లో కమిటీల్ని ప్రకటించే అవకాశముంది. ముందుగా జిల్లా అధ్యక్షులను ప్రకటించనున్నారు. అయితే పలు జిల్లాల్లో కార్యవర్గాల కూర్పు ఇంకా కుదరకపోవడంతో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సమీక్షలు జరుపుతున్నారు. అన్ని వర్గాల వారిని, ముందు నుంచి పార్టీకి సేవ చేసిన వారిని సంతృప్తి పరిచేలా కార్యవర్గాలను తీర్చిదిద్దుతున్నారు.
కొన్ని జిల్లాలకు పాత అధ్యక్షులే!
జిల్లా అధ్యక్షుల నియామకాన్ని తనకు వదిలేయాలని కేసీఆర్ ఇప్పటికే సూచించినా... ఆయా జిల్లాల నుంచి ఇద్దరు ముగ్గురి పేర్లతో కూడిన జాబితాలు ఆయనకు అందాయి. అన్ని కోణాల్లో పరిశీలించి ఆ పేర్ల నుంచే అధ్యక్షులను నిర్ణయించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 31 జిల్లాలకు గాను కొన్ని జిల్లాల్లో పాత అధ్యక్షులనే కొనసాగించనున్నట్లు పేర్కొంటున్నాయి. మొదట ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలన్న చ ర్చ జరిగినా.. వివిధ కారణాల వల్ల ఇతరులకే ఎక్కువ అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది.
పలుచోట్ల పోటా పోటీ
వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో ఇద్దరికి మించి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోనూ పోటీ ఉంది. స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్, ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సకినాల శోభన్ , ఎస్.శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. శోభన్, శ్రీనివాస్‌రెడ్డి పేర్లను మంత్రి చందూలాల్ ప్రతిపాదించారు. ఇక స్పీకర్ నేరుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేనందున తన తనయుడి పేరు ప్రతిపాదించారని, అది కుదరకపోతే మరో ఇద్దరి పేర్లనూ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. నిర్మల్‌లో సత్యనారాయణగౌడ్, రామకృష్ణారెడ్డిల మధ్య పోటీ ఉంది. ఆసిఫాబాద్‌లో కావేటి సమ్మయ్య, ఆర్కే నాగేశ్వర్‌రావులో ఒకరికి ఖాయం కానుంది. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, వెంకటేశ్‌గౌడ్, ఆర్.సత్యనారాయణల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మెదక్‌లో ఎలక్షన్‌రెడ్డి, ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న మురళీ యాదవ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. వనపర్తి జిల్లాలో బి.లక్ష్మయ్య, శ్రీధర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి పి.రాములు, తోకల మనోహర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కొన్ని పేర్లు ఖరారు..
పలువురు పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆరుగురు పాత అధ్యక్షులకే మళ్లీ అవకాశం దక్కనుంది. ఆది లాబాద్‌కు-లోక భూమారెడ్డి, నిజామాబాద్‌కు ఈగ గంగారెడ్డి, మహబూబాబాద్‌కు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఖమ్మంకు బుడన్ బేగ్, మహబూబ్‌నగర్‌కు శివకుమార్, వికారాబాద్ జిల్లాకు నాగేందర్‌గౌడ్‌లనే కొనసాగించే అవకాశముంది. ఇక రంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, మేడ్చల్‌కు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నల్లగొండకు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేటకు ఎర్నేని వెంకటరత్నం బాబు, భువనగిరికి కె.రామకృష్ణారెడ్డి, కరీంనగర్‌కు రామకృష్ణారావు, సిరిసిల్లకు తోట ఆగయ్య, పెద్దపల్లికి వెంకటరమణారెడ్డి, కామారెడ్డికి ముజీబుద్దీన్, సిద్దిపేటకు వేలేటి రాధాకృష్ణశర్మ, కొత్తగూడెంకు తాళ్లూరి వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని తెలుస్తోంది.