ఆ రెండూ అటే..
జిల్లా విభజనలో కొంత స్పష్టత
60 కిలోమీటర్ల నిబంధనతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు ఔట్
యాదాద్రి జిల్లా కూడా ఖాయమైనట్టే...
ఆలేరు-జనగాంకు మధ్యలో జిల్లా కేంద్రం!
సూర్యాపేట కలెక్టరేట్ ఎక్కడన్న దానిపై వివరాలు గోప్యం
జిల్లా విభజన బాధ్యతలు జగదీశ్‌రెడ్డి, కిశోర్‌లపైనే..
ఐఏఎస్‌ల కేటాయింపు, పునర్విభజన కమిటీలతో ప్రక్రియ మరింత వేగిరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తాజా పరిణామాలతో జిల్లా విభజనలో కొంత స్పష్టత వచ్చింది. జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మూడు అంశాలను పరిశీలించింది. అందులో ఒకటి జిల్లా కేంద్రానికి, ఇతర నియోజకవర్గ కేంద్రాలకు ఉన్న దూరాన్ని బట్టి జిల్లాలు విభజించాలి. రెండోది పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలి. మూడోది జనాభా ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటు చేయాలి.
అయితే, ఈ మూడింటిలో మొదటి ప్రతిపాదనే ఓకే అయిందని, అందులో కూడా జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రాలకు 50 నుంచి 60 కిలో మీటర్లు ఉండేలా విభజన జరగాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా సమాచారం అడిగారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే భువనగిరి నుంచి నల్లగొండకు 70 కిలోమీటర్ల దూరం కాగా, ఆలేరుకు 92 కిలోమీటర్ల దూరం ఉంది.
ఈ పరిస్థితుల్లో దూరం ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తే ఆ రెండు నియోజకవర్గాలు వెళ్లిపోయినట్టే. అయితే, వరంగల్ జిల్లా జనగాం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న జిల్లాలో స్వల్ప మార్పులు చేసి యాదాద్రి పేరిట ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ జిల్లా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఆలేరు - జనగాం మధ్యలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
‘పేట’ పరిస్థితి ఏంటి?
ఇక, తొలిదశలోనే కొత్త జిల్లాగా ఏర్పాటవుతుందని భావిస్తున్న సూర్యాపేటలో పరిపాలన భవనాలను ఎక్కడ నిర్మించాలన్న దానిపై అటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇటు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సూర్యాపేటలో గతంలో ఓ స్థలాన్ని అనుకున్నా... దానిని సీఎం కేసీఆరే స్వయంగా తిరస్కరించారని, అన్ని భవనాలు ఒకే చోట ఉండేలా వీలైనంత ఎక్కువ స్థలం చూడాలని అధికారులను ఆదేశించారని సమాచారం.
ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ కోసం స్థలం ఎక్కడ చూడాలన్న దానిపై రెండు, మూడు ప్రతిపాదనలున్నా ఎక్కడ చూస్తున్నారనే దానిపై అటు అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ నోరు మెదపడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకునే వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జిల్లాల పునర్విభజన కమిటీల ఏర్పాటులో భాగంగా నల్లగొండ జిల్లా విభజన బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు అప్పగించడం గమనార్హం. జిల్లా విభజన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వీరి బాధ్యతగా తెలుస్తోంది.
పెరగనున్న రాజకీయ పదవులు
జిల్లా విభజన జరిగితే ఔత్సాహిక రాజకీయ నేతలకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా జడ్పీచైర్మన్‌తో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు, వాటి పాలకవర్గాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి లాంటి నామినేటెడ్ పోస్టులు అదనంగా రానున్నాయి. వీటికితోడు మండలాలు పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎంపీపీలు, జడ్పీటీసీల పదవులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. దీంతో రాజకీయ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న రాజకీయ నాయకులకు జిల్లాల పునర్విభజన మేలు చేకూర్చనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర నిధులు, పాలనా వికేంద్రీకరణ కోసమే..
‘జిల్లాల పునర్విభజన అంశం తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయి. జిల్లాల ప్రాతిపదికగా కేంద్రం నిధులిస్తుంది కనుక మన రాష్ట్రంలో జిల్లాలు పెరిగితే ఆ మేరకు నిధులు కూడా పెరుగుతాయి. అదే విధంగా జిల్లాల విభజన వల్ల పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. అంటే ప్రజలకు పాలన దగ్గరవుతుంది. తెలంగాణ రాష్ట్రం కోరింది కూడా అదే నినాదంతో. ప్రాంతాలు విడిపోతాయి... కానీ ప్రజలు విడిపోరు అనే తెలంగాణ ఉద్యమ నినాదమే జిల్లాల పునర్విభజనకు స్ఫూర్తి. నల్లగొండ జిల్లా విభజనపై కసరత్తు జరుగుతుంది కానీ, మరి కొన్ని సమావేశాలు, చర్చలు జరిగితే కానీ పూర్తిస్థాయిలో స్పష్టత రాదు.
-గాదరి కిశోర్, జిల్లా పునర్విభజన కమిటీ సభ్యుడు
నల్లగొండ జిల్లా కేంద్రానికి, వివిధ నియోజకవర్గాలకు దూరం
నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు, నల్లగొండకు దూరం: 33 కిలోమీటర్లు
దేవరకొండ - నల్లగొండ మధ్య దూరం: 60 కిలోమీటర్లు
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చండూరుకు,
నల్లగొండకు దూరం: 33 కిలోమీటర్లు
నకిరేకల్ నుంచి నల్లగొండకు దూరం: 27 కిలోమీటర్లు (వయా కట్టంగూరు), 22 కిలోమీటర్లు (వయా తాటికల్)
సూర్యాపేట జిల్లా కేంద్రానికి, వివిధ నియోజకవర్గాలకు దూరం
కోదాడకు సూర్యాపేటకు దూరం: 40 కిలోమీటర్లు
హుజూర్‌నగర్ నుంచి సూర్యాపేటకు: 56 కిలోమీటర్లు
తుంగతుర్తి - సూర్యాపేట మధ్య దూరం: 36 కిలోమీటర్లు
మిర్యాలగూడ - సూర్యాపేట మధ్య దూరం: 45 కిలోమీటర్లు (వయా భీమారం), 55 కిలోమీటర్లు (వయా నేరేడుచర్ల).
ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి జనగాంకు దూరం: 16
కిలోమీటర్లు... జిల్లా కేంద్రాన్ని ఆలేరు-జనగాం మధ్యలో ఏర్పాటు చేస్తే ఈ దూరం మరింత తగ్గనుంది. ఆలేరు నుంచి సిద్దిపేట 65 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో చేర్చే అవకాశం లేదు. భువనగిరిని హైదరాబాద్ ఈస్ట్ జిల్లాలో చేర్చి జిల్లా కేంద్రం చేయని పక్షంలో ఉప్పల్ లేదా ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి ఉప్పల్‌కు 40 కిలోమీటర్లు, ఎల్బీనగర్‌కు 54 కిలోమీటర్ల దూరం ఉంటుంది.