సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఓటు అమ్ముకోవద్దు.. ఓటు విలువ తెలుసుకో అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల పేరుతో ఓటర్లను ఆకర్షించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాటు పాలించే నాయకుడిని రూ. 500లు తీసుకుని ఓటు వేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రూ. 500లకు ఓటు వేస్తే రోజుకు 27 పైసల చొప్పున తీసుకున్నట్లు అవుతుందని వివరిస్తున్నారు. కనీసం భిక్షాటన చేసే వారు కూడా 27 పైసలను భిక్షంగా తీసుకోరని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేరిట ఫ్లెక్సీల ను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయించింది. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎంత మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరచడానికి ఫ్లెక్సీలు ఎంతో దోహదపడుతున్నాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. డబ్బు, మద్యం ప్రభావం లేకుండా చేయడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలను నిరోధించడానికి ఎన్నికల కమిషన్ ఇలాంటి చర్యలు తీసుకుంది. ప్రజలను ప్రలోభాలకు గురికాకుండా చేయడానికి ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగడం ఆహ్వానించదగిన పరిణామం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment