
గిరిజనులను మోసం చేయొద్దు
- పోడు భూముల్లో హ రితహారం మానుకోవాలి
- అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ సింహాద్రి ఝాన్సీ
- ఆర్డీవో కార్యాలయం ముట్టడి
ములుగు : తరతరాలుగా ఆదివాసీలు అడవినే నమ్ముకొనే జీవిస్తున్నారని, వారిని మోసం చేయడం తగదని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ కామ్రెడ్ సింహాద్రి ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల పోడు భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కామ్రెడ్ ఝాన్సీ మాట్లాడారు. అడవిలో లభించే సందప, పోడు వ్యవసాయం గిరిజనులకు జీవనాధారమని, వాటిని దూరం చేయాలని చూస్తే సహించేది లేదని మండిపడ్డారు. గిరిజనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ సాధిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ నేడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి పొట్టలు నింపుకున్నారని ఆరోపించారు. ఇప్పుడేమో గ్రామాల్లో పాత వెలుగులు తీసుకువస్తానని గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాడని, ఇది ఏ మేరకు సాధ్యపడుతుందో వేచి చూడాలని అన్నారు.
సీపీఐఎంఎల్ కేంద్ర కమిటీ నాయకుడు గుర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచిపోయి పేద ప్రజలపై నిత్యవసర సరుకుల ధరల భారం మోపుతోందని ఆరోపించారు. సమావేశంలో తెలంగాణ ైరె తు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి భూతం వీరన్న, నల్లాని స్వామిరావు, మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి బాదవత్ రాజు, వివిధ సంఘాల నాయకులు మోడెం మల్లేశం, పిట్టల సత్యం, ఈర్ల పైడి, పల్లెబోయిన స్వామి, బానోతు నరసింహ. మోడెం శ్రీలత, ఊకె ఎల్లక్క, బల్గూరి వెంకటరెడ్డి, ఐలన్న, చందర్, యాకూబ్, రాములు, ఎల్లన్న, ప్రసాద్, రాంచందర్, అశోక్, బాలకొమురు, భీమన్నలు పాల్గొన్నారు.