
చంద్రబాబును వదలొద్దు: ఆప్
తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబును వదిలి పెట్టొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారత విభాగం ఇన్‌చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించొద్దని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమనాథ్ భారతి మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఏసీబీకి చిక్కినా... కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పట్ల చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాట మాత్రం కూడా దీనిపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందని ఆరోపించారు. ఒక కుటుంబానికి చెందిన నలుగురి చేతుల్లో పాలన కేంద్రీకృతమై ఉందన్నారు. కేంద్రంలో కూతురుకు పదవి కోసం సీఎం కేసీఆర్ రాయబారం చేస్తున్నారని, దీంతో కేంద్రం ఏం చేసినా విమర్శించడం లేదని ఆయన దుయ్యబట్టారు.