సాగునీటిని వృథా చేయొద్దు
► ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి
► ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచన
► ఫలించిన రైతుల పోరాటం
► కోయిల్‌సాగర్ నుంచి నీటి విడుదల
నెల రోజులుగా కోయిల్‌సాగర్ రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళన చేశారు. చివరకు ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోయిల్‌సాగర్ నుంచి నీటిని వదిలారు.
కోయిల్‌సాగర్ (దేవరకద్ర రూరల్) : కోయిల్‌సాగర్ నీటిని రైతులు వృథా చేయొద్దని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. ఎంతో కష్టపడి లిఫ్టు ద్వా రా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కోయిల్‌సాగర్‌కు తె చ్చిన కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నారాయణపేట టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ శివకుమార్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌కు సరఫరా చేసే తాగునీటికి ఇబ్బంది కలుగకుండా ఆయకట్టుకు వదులుతున్నామన్నారు.
ఈ నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా 5 రోజుల పాటు ఆయకట్టు రైతులకు విడుదల చేస్తామన్నారు. ఎడమ కాల్వకు 30, కుడికాల్వకు 90 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల సమస్యలను మంత్రులు హరిశ్‌రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి వెంటనే నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే ఆయకట్టుకు నీటిని వదిలారు. కోయిల్‌సాగర్ నీటిని రాజకీయం చేయడానికి కొంత మంది నాయకులు ప్రయత్నించారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, ప్రాజెక్టు అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.