ఎయిడ్స్‌ రోగా... ప్రసవం చేయం | Doctors refusing medicine for pregnant HIV | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రోగా... ప్రసవం చేయం

Published Fri, Jul 14 2017 2:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

Doctors refusing medicine for pregnant HIV

నాగర్‌కర్నూల్‌లో గర్భిణీకి వైద్యం నిరాకరించిన డాక్టర్లు
సాక్షి, నాగర్‌ కర్నూల్‌: ఎయిడ్స్‌ సోకిన గర్భిణికి ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా చేదు అనుభవం ఎదురైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చిన సమయంలో వైద్యపరీక్షలు చేయించగా హెచ్‌ఐవీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అయితే, ఆమె భర్తకు వ్యాధి లేకపోవడంతో.. టీకాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఆమెకు వ్యాధి సోకిందని కుటుంబీకులు నిర్ధారణకు వచ్చారు. ప్రసవం సమయం సమీపిస్తుండగా ఏ ఆస్పత్రిలో సంప్రదించినా వైద్యులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లోని జడ్జిఖానా ఆస్పత్రిలో మాత్రమే ఇలాంటి వారికి ఆపరేషన్లు చేస్తారని, అక్కడికి వెళ్లాల్సిందేనంటూ ఐసీటీసీ అడ్వైజర్‌ సలహా ఇచ్చారు. కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సదరు మహిళకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి.

గ్రామంలోని మంత్రసానులు ప్రసవం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో సంప్రదిస్తే రిపోర్టులు చూసిన వైద్యులు కాన్పు చేయలేమని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఆమె తనకు ఉన్న వ్యాధితో పాటు పేరును మార్చి చెప్పి నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు బుధవారం రాత్రి శస్త్రచికిత్స చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా, ప్రసవం చేశాక ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు వైద్యులు గుర్తించి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. విషయాన్ని ముందే చెప్పకపోవడంతో తమతో పాటు సిబ్బందికి వ్యాధి సోకే ప్రమాదముందని పేర్కొంటూ ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, తప్పని పరిస్థితుల్లో తామిలా చేయాల్సి వచ్చిందంటూ గర్భిణి మహిళ తరఫున వారి బంధువులు డాక్టర్లను వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement