దొడ్డి కొమురయ్య (ఊహా చిత్రం)
సాక్షి, దేవరుప్పుల: నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కొమురయ్య(డీకే) తొలి అమరత్వానికి నేటికి 73 ఏళ్లు నిండుకున్నాయి. నిజాం సర్కారు హయాంలో విస్నూర్ కేంద్రంగా దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.
1947 జూలై 4వ తేదీన ప్రస్తుత బొడ్రాయి ఏరియాలో ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్న దొరసాని ఆగడాలను ఎండగడుతూ ప్రదర్శనకు వస్తుండగా గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా తొలుత దొడ్డి మల్లయ్య తొడకు, మంగళి కొండయ్య నుదట, దొడ్డి నర్సయ్య మోచేతి గుండా వెళ్లిన తుటాలు ఆ తర్వాత దొడ్డి కొమురయ్య పొట్టలో నుంచి తుటాలు పోవడంతో రక్తంతో నేలతడిచింది.
శాంతియుతంగా కొనసాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్త కొమురయ్య తొలి అమరత్వంతో రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మల్చుకొని ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కింది. నిజాం సర్కారు నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఆరున్నర దశాబ్దాలు పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కారు అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ జరుపకపోవడం గమనార్హం.
వారసత్వపు సంస్మరణ సభ
ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కిన దొడ్డి కొమురయ్య స్మారకార్థం సీపీఐ ఆధ్వర్యంలో కడవెండిలో బొడ్రాయి వద్ద భారీ స్థూపంతోపాటు సమీపంలోనే స్థానికులకు ఉపయోగపడేలా స్మారక భవనం నిర్మించారు. స్థానికంగా నేటికి పంచాయతీ భవనం నోచుకోక ఈ భవనంలోనే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవడం అద్దం పడుతుంది. కాగా ప్రతి ఏటా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున డీకే సంస్మరణ సభలు కొనసాగిస్తూ తమ ఎర్రజెండా వారసత్వాన్ని చాటుతున్నారు.
పత్రికలో మరణవార్త
నిజాం కాలంలో వెలుగొందుతున్న మీజాన్ పత్రికలో విస్నూర్ దొరల విజృంభణ, ఆంధ్ర మహాసభ కార్యకర్త ‘దొడ్డి కొమురయ్య హతం’ అనే వార్తా కథనం తొలి అమరత్వానికి చారిత్రాత్మకంగా నిలిచింది.
పోరాటం లేకుంటే రాష్ట్రం వచ్చేదా?
నిజాం సర్కారు విముక్తి కోసం సాగిన ఆ పోరాటం లేకుంటే ఈనాటి తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈ ప్రాంతంలో విస్నూర్ దేశముఖ్‌లను అంతమొందించేందుకు స్వార్థం లేకుండా తుపాకీ పట్టి పోరాటం చేశాం. అలాంటి అమరుల విగ్రహాలు ఏర్పరచి రాష్ట్రంలో ప్రభుత్వమే ఏటా కొలిచేలా సభలు పెట్టాలి.
– జాటోతు దర్గ్యానాయక్, ధర్మాపురం
Comments
Please login to add a commentAdd a comment